అవసరం ఉన్నా లేకపోయినా ఎడా పెడా సిమ్ కార్డులు తీసుకోవడం కొంతమందికి సరదా. అవసరమైనప్పుడు వాడుకోవచ్చులే అని మినిమమ్ రీచార్జ్ చేయిస్తూ వాటిని అలా పక్కనపడేస్తుంటారు. మరికొంతమంది తమ బంధువులకోసం, స్నేహితులకోసం కూడా తమ పేరుమీదే సిమ్ కార్డులు తీసుకుంటారు. ఆ తర్వాత వాటి విషయమే మరచిపోతారు. అలాంటివారందరికీ భారత టెలికం సంస్థ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. సిమ్ కార్డులపై పరిమితి విధించింది.

ఒక్కొకరికి 9 కనెక్షన్లు మాత్రమే..
ఇప్పటి వరకూ భారత్ లో ఇలాంటి పరిమితి లేదు. ఎవరెన్ని కనెక్షన్లు కావాలన్నా తీసుకోవచ్చు. కానీ తొలిసారిగా భారత్ లో సిమ్ కార్డులపై పరిమితి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఒకరికి గరిష్టంగా 9 సిమ్ కార్డులు మాత్రమే ఇస్తారు. అంతకంటే ఎక్కువ తీసుకోవాలని ప్రయత్నిస్తే పాతవాటిలో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలకయితే ఇంకా కోత కోసేశారు. అక్కడి పౌరులకు గరిష్టంగా 6 సిమ్ కార్డ్ లు మాత్రమే ఉండాలంటూ పరిమితి విధించారు.

ఆన్ లైన్ మోసాలు అరికట్టేందుకు..
ప్రస్తుతం ఆన్ లైన్ మోసాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. తీరా ఫోన్ కాల్స్ లిస్ట్ తీస్తే.. అసలా కనెక్షన్లు తీసుకున్నవారు, మోసం చేసినవారికి సంబంధమే ఉండదు. ఫేక్ ఐడీ ప్రూఫ్స్ తో చాలామంది ఇలాంటి పనులు చేస్తున్నారు. తెలిసిన వారిని కూడా కొంతమంది మోసం చేస్తుంటారు. దీంతో ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 9కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే.. వాటిలో మనక అవసరమైనవాటిని ఉంచుకుని మిగతా వాటిని తొలగించుకునే స్వేచ్ఛను ఇస్తారు. ఒకవేళ మనం నిర్ణయం తీసుకోలేకపోతే టెలికం ఆపరేటర్లు 9 తర్వాత తీసుకున్నవాటిని తొలగిస్తారు. 45రోజలు టైమ్ ఇచ్చి ఆ నెంబర్ ని పూర్తిగా డిలీట్ చేస్తారు.

టెలికం ఆపరేటర్లు ప్రస్తుతం ఎవరెవరు ఎన్ని సిమ్ కార్డులు అడిగినా ఇచ్చేస్తున్నాయి. ఇకపై కొత్త సిమ్ కార్డ్ కావాలంటూ ఎవరైనా వస్తే.. వారి హిస్టరీ చూస్తారు. గతంలో ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నారు, ఇది ఎన్నోది అని లెక్కతీస్తారు. 9దాటితే నిర్మొహమాటంగా కనెక్షన్ ఇవ్వలేం అని చెప్పేస్తారు. లేదంటే పాతవాటిని తొలగించుకునే ఆప్షన్ మనకే ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: