2014లో 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్తా... రెండు చిన్న రాష్ట్రాలుగా విడిపోయింది. 10 జిల్లాలు తెలంగాణ, 13 జిల్లాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తూ... నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు పలు కీలక ప్రకటనలు కూడా చేసింది. పూర్తిగా వెనుకబడిన రాష్ట్రంగా పరిగణించిన నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం... తాయిలాలు ప్రకటించింది. రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని, అలాగే ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పోలవరం ప్రాజెక్టును జాతీయ స్థాయి ప్రాజెక్టుగా గుర్తించి... మొత్తం నిధుల ఖర్చు కేంద్రం భరిస్తుంది అని కూడా పార్లమెంట్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. అయితే ప్రత్యేక హోదా పదేళ్లు కాదు... 15 ఏళ్లు కావాలని సభలో భారతీయ జనతా పార్టీ సభ్యులు గట్టిగానే పోరాటం చేశారు. అయితే ఈ పోరాటం అంతా ఏడాది తర్వాత గాలిలో కలిసిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కమలం పార్టీ నేతలు ప్లేటు ఫిరాయించారు. 15 కాదు కదా.... కనీసం ఏడాది పాటు కూడా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చేసింది మోదీ ప్రభుత్వం.

ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చిన కేంద్ర ప్రభుత్వం... 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను సాకుగా చూపించింది. అయితే విభజన హామీల్లో భాగంగా .... ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఇస్తామని ప్రకటించింది. హోదాకు సమానమైనదే ప్యాకేజీ అని నాటి కేంద్ర మంత్రి ప్రకటించారు. అసలు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని నిండు సభలో చెప్పిన కేంద్ర పెద్దలు... అదే సమయంలో జమ్ము రాష్ట్రాన్ని మాత్రం స్పెషల్ స్టేటస్ స్టేట్ అంటూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. గతంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేసిన ఏపీ ఎంపీలు... ఇప్పుడు కనీసం ఆ మాట కూడా ఎత్తడం లేదు. గతంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాపై పోరాటం చేసింది. కేంద్రం మెడలు వంచుతామని కూడా జగన్ ప్రకటించారు. కానీ ప్రస్తుతం 22 మంది ఎంపీలు ఉన్నా కూడా... కనీస ప్రస్తావన లేదు. గతంలో మన్మోహన్ ప్రభుత్వం ప్రకటించిన పదేళ్లలో ఇప్పటికే 8 ఏళ్లు పూర్తి కావస్తుంది. మరో రెండేళ్లు గడిస్తే... హోదాపై మాట్లాడే అధికారం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండదు. అంటే హోదా హుళక్కేనా....!


మరింత సమాచారం తెలుసుకోండి: