ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రాష్ట్రాలుగా విభజిస్తే తమకు ఆర్థికంగా నష్టం జరుగుతుందని కేంద్రాన్ని నిలదీశారు ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఎంపీలు. దీంతో సుదీర్ఘ మంతనాల తర్వాత, జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ప్రకారం... ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని నాటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. పార్లమెంట్ ఉభయ సభల్లో నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ విభజన హామీలపై కీలక ప్రసంగం చేశారు. ఇందులో ప్రధానంగా గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తున్నట్లు అప్పట్లో ప్రధాని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చు కేంద్రమే భరిస్తుందని కూడా వెల్లడించారు. గతంలో ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన నిధులను కూడా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి మంజూరు చేస్తామన్నారు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్. దీనిపై అప్పట్లో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఏపీకి పోలవరం ఇచ్చారు కాబట్టి.... తమకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని తెలంగాణ సర్కార్ కూడా డిమాండ్ చేసింది. కానీ కేంద్రం ససేమిరా అనేసింది.

అయితే రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు పూర్తవుతున్నా కూడా... పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం ఇప్పటికీ కేంద్రంతో పోరాటం చేస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు. గతంలో ప్రాజెక్టు పూర్తి ఖర్చు భరిస్తామని చెప్పిన కేంద్ర జల శక్తి శాఖ... ఆ తర్వాత మాట మార్చింది. కేవలం ఇరిగేషన్ పనులకు మాత్రమే నిధులు కేటాయిస్తామని చెప్పేసింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి.. ఇప్పటికీ అలాగే ఉంది. ప్రాజెక్టు కోసం ఇప్పటికే 2017-18 మధ్యకాలంలో రెండవ సారి సవరించిన అంచనా వ్యయం మొత్తం 55 వేల 548 కోట్ల రూపాయలని రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్‌లో గుర్తు చేశారు. అయితే కేంద్రం మాత్రం.. రివైజ్డ్ కాస్ట్ కమిటీ సవరించిన అంచనా వ్యయంలో ఇరిగేషన్ విభాగానికి కేవలం 35 వేల 950 కోట్ల రూపాయలుగా కుదించినట్లు తెలిపింది. పైగా ఇప్పటి వరకు ఖర్చు చేసిన వివరాలు ఇవ్వాలని కూడా కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అసలు ఇచ్చిన మాట ఏమిటీ... ఇప్పుడు చేస్తునది ఏమిటీ అని కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: