తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌న ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ ను టార్గెట్‌గా విప‌క్షాలు దూకుడు పెంచుతున్నాయి. వ‌రి ధాన్యం కొనుగోలులో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని వంద‌ల కోట్ల అవినీతి జ‌రిగింద‌ని బీజేపీ ఆరోపిస్తోంది. బియ్యం స్మ‌గ్లింగ్‌లో కేటీఆర్ హ‌స్తం ఉంద‌ని ఆరోపించారు బీజేపీ ఎంపీ అరవింద్‌. ఇక బియ్యం స్మ‌గ్లింగ్ ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపుతుండ‌గానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మ‌రొక బాంబ్ పేల్చి.. కేటీఆర్ బ‌డా స్కాంలో చిక్కుకున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఈ స్కాంపై ఈడీ విచార‌ణ జ‌ర‌గ‌కుండా కేంద్రపెద్ద‌ల‌తో కేసీఆర్ డీల్ కుదుర్చుకున్నార‌ని అంటున్నారు.


 కేటీఆర్ స్కాంకు సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన ఆరోప‌ణలు ఇప్పుడు తెలంగాణ‌లో సంచ‌ల‌నంగా మారాయి. బియ్యం స్మ‌గ్లింగ్‌లో కేటీఆర్ హ‌స్తం ఉంద‌ని ఇప్ప‌టికే బీజేపీ ఆరోపిస్తుండ‌గా తాజాగా రేవంత్ రెడ్డి చేసిన భూ స్కాం ఆరోప‌ణ‌లతో టీఆర్ఎస్ పార్టీ షేక్ అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. టీఆర్ఎస్ ఎంపీలు పార్ల‌మెంట్ ఉభ‌య సభ‌ల స‌మావేశాలను బ‌హిష్క‌రించ‌డంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్-బీజేపీ డీల్‌లో భాగంగానే ఇదంతా జ‌రిగిందంటున్నారు. ఇక ఓ భూకుంభ‌కోణంలో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయ‌డాన్ని ఈడీ తాత్కాలికంగా వాయిదా వేసింద‌ని, ఇందుకు బదులుగా పార్ల‌మెంట్ స‌జావుగా సాగేలా కేంద్రానికి స‌హ‌క‌రించడానికి టీఆర్ఎస్ ఎంపీలు స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించార‌ని చెప్పారు.


   బియ్యం స్మ‌గ్లింగ్‌పై బీజేపీ ఆరోపిస్తుంటే.. మ‌రోవైపు 3వేల కోట్ల రూపాయ‌ల భూ స్కాంలో కేటీఆర్ ఉన్నాడ‌ని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రెండు స్కాముల్లో కీల‌క సూత్ర‌ధారి కేటీఆర్ అనే ఆరోపణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో రాజ‌కీయంగా వేడి పుడుతోంది. ఒక‌వేళ ఈ రెండు స్కాముల్లో విచార‌ణ జ‌రిగితే కేటీఆర్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. టీఆర్ఎస్ నేత‌లు మాత్రం విప‌క్షాల ఆరోప‌ణ‌ల‌ను కొట్టి ప‌రేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు టీఆర్ఎస్ నేత‌లు. మ‌రి రానున్న రోజుల్లో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: