ఏక‌గ్రీవ‌మైన ఎమ్మెల్సీ స్థానాల్లో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు తీవ్ర ఆందోళ‌న‌గా ఉన్నారు. అధికార పార్టీ నేత‌లు త‌మ‌ను మ‌భ్య‌పెట్టి పోటీ నుంచి విర‌మించార‌ని కొంద‌రు అభ్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా ఆదుకుంటామ‌ని.. నిధులు, విధులు ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీలు ఇచ్చి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఓట‌ర్లు బాధ‌ప‌డుతున్నారు. పోలింగ్ తేదీ కూడా ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ఇప్ప‌టికైనా త‌మ‌ను ఆదుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

తెలంగాణ‌లో ఇటీవ‌ల 19 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఖాళీ ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఇందులో ఒక‌టి గ‌వ‌ర్న‌ర్ కోటాలో భ‌ర్తీ చేయ‌గా.. ఆరు స్థానాల‌ను ఎమ్మెల్యేల కోటాలో పూర్తి చేశారు. మిగ‌తా 12 స్థానిక సంస్థ‌ల స్థానాల‌కు ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ఇచ్చింది. ఇందులో 6 స్థానాలు ఏక‌గ్రీవం అవ‌గా.. మిగ‌తా 6 స్థానాల‌కు రేపు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

టీఆర్ఎస్ త‌ర‌పున నిజామాబాద్ నుంచి క‌విత‌, రంగారెడ్డి నుంచి ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, వ‌రంగ‌ల్ నుంచి పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి, కూచుకుళ్ల దామోద‌ర్‌రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. మ‌రో ఆరుచోట్ల డిసెంబ‌రు 10న ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి దండె విఠ‌ల్‌, న‌ల్ల‌గొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, ఖ‌మ్మం నుంచి తాతా మ‌ధుసూద‌న్‌, క‌రీంన‌గ‌ర్ నుంచి ఎల్‌.ర‌మ‌ణ‌, టి.భానుప్ర‌సాద‌రావు, మెద‌క్ నుంచి డాక్టర్ యాద‌వ‌రెడ్డి అధికార పార్టీ త‌ర‌పున బ‌రిలో నిలిచారు. స్వ‌తంత్రులు, ఇత‌ర పార్టీల అభ్య‌ర్థులు నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకోక‌పోవ‌డంతో ఈ స్థానాల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి వ‌స్తోంది.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా అస‌లు చిక్కు ఇక్క‌డే వ‌చ్చింది. పోటీలో ఉన్న స్థానాల్లో అధికార పార్టీ త‌మ అభ్య‌ర్థుల‌ను క్యాంపుల‌కు త‌ర‌లించింది. ఓట‌ర్ల‌ను గోవా, ఢిల్లీ ఇత‌ర ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు త‌ర‌లించింది. వారు విహార యాత్ర‌ల్లో మ‌స్తు ఎంజాయ్ చేసి వ‌చ్చారు. న‌జ‌రానాలు, బ‌హుమ‌తులు కూడా అందుకున్నారు. ప్ర‌త్యేక ప్యాకేజీలు తీసుకున్నారు. పోటీ ఉన్న స్థానాల్లో ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఏక‌గ్రీవ‌మైన స్థానాల్లో ఓట‌ర్లు తెగ ఫీలైపోతున్నారు. పోలింగ్ తేదీ స‌మీపిస్తున్నా త‌మ‌కు ఏమీ అంద‌లేద‌ని.. ఏకగ్రీవ‌మైన అభ్య‌ర్థులు క‌నీసం త‌మ‌ను ప‌ల‌క‌రించ‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఎవ‌రైనా ఒక‌రం పోటీలో ఉంటే త‌మ త‌డాఖా చూపించేవాళ్ల‌మ‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల జిల్లా ప‌రిష‌త్‌ల‌కు నిధులు కేటాయించినా.. ప్ర‌త్యేకంగా త‌మ‌కేమీ గిట్టుబాటు కాద‌ని అంటున్నారు. క‌నీసం త‌మకు ప్యాకేజీలు అయినా ఇవ్వాల‌ని అడుగుతున్నారు. రేప‌టితో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు స‌మాప్తి. చూడాలి మ‌రి టీఆర్ఎస్ వారిని ఏవిధంగా బుజ్జ‌గిస్తుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR