కాంగ్రెస్ పార్టీలో చేరి దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నుకున్న ప్రముఖ రాజ‌కీయ స‌ల‌హాదారుడు ప్ర‌శాంత్ కిషోర్ కు అక్క‌డ అడ్డుపుల్ల ప‌డింద‌ని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసి మ‌మ‌తా బెన‌ర్జీని ఆ స్థానంలో భ‌ర్తీ చేయాల‌ని త‌న ఫిరాయింపుల రాజ‌కీయ వ్యూహాల‌ను ప్ర‌యోగిస్తున్నారు. అయితే, అది ప్ర‌శాంత్ కిషోర్ అనుకున్నంత‌ సులువుగా కొన‌సాగ‌డం లేదు. బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ తో యూపీఏ ఉందని అనిపించినా.. కాంగ్రెస్ పార్టీ కూట‌మిలోనే ఉండేందుకు ప్ర‌ధాన ప్రాంతీయ పార్టీలు సుముఖ‌త చూపుతున్నాయి. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్ పార్టీతో క‌లిసి ప‌నిచేస్తామ‌ని శివ‌సేన చెబుతూ వ‌స్తోంది.


   ఇప్పుడు, కాంగ్రెస్‌లో జాతీయంగా క‌లుస్తామ‌ని.. యూపీఏ కూట‌మిలో భాగ‌స్వామ్యం అవుతామ‌ని ప్ర‌క‌టించింది. అయితే, దేశ రాజ‌కీయాల్లో త‌న స‌త్తా చాటాల‌నుకుంటున్న మ‌మ‌తా బెన‌ర్జీకీ కాస్త ఇబ్బంది క‌లిగించే విష‌య‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌కు పార్టీల స‌పోర్ట్ పెరిగితే త‌న వెనుక ఉండాల్సిన వారికి న‌మ్మ‌కం త‌గ్గిపోతుంది. అయితే, ప్ర‌స్తుతం ప్రాంతీయ పార్టీలు బీజేపీ వైపు కాక‌పోతే కాంగ్రెస్ వైపు చూడాల‌నుకుంటున్నాయి. కానీ, మ‌మ‌తా బెన‌ర్జీ వైపు చూడాల‌నుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది.

తెలంగాణ‌లో టీఆర్ఎస్ కూడా మ‌మ‌త కంటే కాంగ్రెస్ బెట‌ర‌ని భావిస్తోంది. బీజేపీ ప‌రిస్థితి దిగ‌జారుతుంద‌నిపిస్తే మ‌రిన్ని పార్టీలు కాంగ్రెస్ వెనుక న‌డిచేందుకు సిద్దం అవుతున్నాయి. వ‌చ్చే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీకి షాక్ త‌గిలితే.. ఆ త‌రువాతి రాజ‌కీయాలు పూర్తి స్థాయిలో మారే అవ‌కాశాలు ఉన్నాయి. అప్పుడు మాత్రం కాంగ్రెస్ కూట‌మిలో చేరే ప్రాంతీయ పార్టీల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేషకులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాలు బెంగాల్ దీది మ‌మ‌తా బెన‌ర్జీని ఒంటరిని చేస్తాయి త‌ప్పా జాతీయ నేత‌గా నిల‌బెట్ట‌లేవ‌న్న అభిప్రాయాలు ఢిల్లీలో వ్య‌క్తం అవుతున్నాయి. దీదీని జాతీయ నేత‌గా తీర్చిదిద్దేందుకు పీకే ఎలాంటి వ్యూహాలు ప‌న్నుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: