ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చేందుకు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొట్టేలా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా ఇప్పటికే మోగింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు వచ్చే నెల పదవ తేదీ నుంచి మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 7వ తేదీన చివరి విడత పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత మార్చి 10వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే దృష్టి సారించాయి. ఇక దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి కాషాయా జెండా ఎగురవేయాలనుకునే బీజేపీ నేతలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ యూపీ ప్రాంతంలోని 58 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైంది. ఆయా అభ్యర్థుల పనితీరును బేరీజు వేసుకుని... కొంత మంది మంత్రులకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా కమల నేతలు టికెట్లు నిరాకరించినట్లు తెలుస్తోంది.

పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతంపై బీజేపీకి గట్టి పట్టు ఉంది. దీంతో అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనేది కమలం పార్టీ ప్లాన్. అలాగే తొలి దశ పోలింగ్ సరళి... మిగిలిన అన్ని దశలపై ఉంటుందని ఆ పార్టీ నేతల భావన. దీంతో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు కాషాయ అగ్రనేతలు. అయితే అధికారం తమదే అని గట్టి ధీమాతో ఉన్న కమలం పార్టీ నేతలకు.... ఊహించని విధంగా షాకులు తగులుతున్నాయి. కేవలం 48 గంటల్లోనే ఆరుగురు కీలక నేతలు బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర మంత్రి, బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత స్వామి ప్రసాద్ మౌర్య పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి గుడ్ బై చెప్పారు. వీరంతా ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది యోగీ సర్కార్. ఎప్పుడో 2014లో ఆయన విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన కేసుకు సంబంధించిన అరెస్ట్ వారెంట్ ఇప్పుడు జారీ చేశారు పోలీసులు. ఈ నెల 24వ తేదీ లోపు కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు. దీంతో ఇప్పుడు బీజేపీ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: