ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న ఒక సంచ‌ల‌న నిర్ణ‌యంపై ఇద్ద‌రు మంత్రులు వివాదాల‌కు దిగారు. ఆ నిర్ణ‌యం వెనుక త‌న ఐడియానే ఉంద‌ని ఒక‌రంటే.. నేను ప్ర‌త్య‌క్షంగా సీఎంను క‌లిసి .. స‌ద‌రు స‌మ‌స్య‌పై వివ‌రించాన‌ని.. అందుకే ఆయ‌న అలాంటి మంచి నిర్ణ‌యం తీసుకున్నార‌ని.. అందుకే.. మ‌న‌కు మంచి పేరు వ‌స్తోంద‌ని.. మ‌రో మంత్రి.. వ్యాఖ్యానిస్తున్నారు. కాదు.. నేనే ద‌గ్గ‌రుండి.. చెప్పి చేయించాను.. అని మ‌రొక‌రు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఈ ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య నేనంటే.. నేనంటూ.. ఒక కీల‌క విష‌యంపై చ‌ర్చ ప్రారంభ‌మై.. అది వ్యాఖ్య‌లు రువ్వుకునే వ‌ర‌కు వ‌చ్చింద‌ట‌.

విష‌యంలోకి వెళ్తే.. సీఎం జ‌గ‌న్‌.. రాష్ట్రంలో మ‌ద్యం ధ‌ర‌ల‌ను త‌గ్గించారు. వాస్త‌వానికి ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు ముట్టుకుంటే షాక్ కొట్టే రీతిలో మ‌ద్యం ధ‌ర‌లు పెంచుతాన‌ని చెప్పారు. అనుకున్న‌ట్టుగానే ఆయ‌న అధికారంలోకి రాగానే భారీ ఎత్తున ధ‌ర‌లు పెంచారు. దాదాపు రెండున్న‌రేళ్ల పాటు ఇదే విధానం కొన‌సాగించారు. దీంతో పొరుగు రాష్ట్రాల‌లో మ‌ద్యం ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉండ‌డంతో మ‌ద్యం బాబు ఆయా రాష్ట్రాల‌కు వెళ్లి వ‌స్తూ వ‌స్తూ.. బాటిళ్లు తెచ్చుకునేవారు. ఇక‌, స‌రిహ‌ద్దు ప్రాంతాల మ‌ద్యం ప్రియులు.. కూడా ఇలా వెళ్లి అలా మందేసి వ‌చ్చేవారు. దీంతో రాష్ట్ర ఖ‌జానాకు తీవ్ర ఇబ్బంది ఏర్ప‌డింది.

పైగా.. సొంత పార్టీ నేత‌లే.. మ‌ద్యాన్ని ఇత‌ర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున తెప్పించి.. అక్ర‌మ వ్యాపారాల‌కు దిగారు. దీంతో ప్ర‌తిప క్షాల నుంచి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అంతేకాదు.. కోర్టుల నుంచి కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఏం చేయాల‌నే విష‌యంపై కొన్నాళ్లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు జ‌రిగినా.. ప్ర‌భుత్వం మాత్రం ధ‌ర‌ల త‌గ్గింపుపై వెన‌క్కి త‌గ్గ‌లేదు. అయితే.. ఇటీవ‌ల జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ.. నిర్ణ‌యం తీసుకుంది. భారీ ఎత్తున ఎలా అయితే.. పెంచారో.. అదేవిధంగా ధ‌ర‌ల‌ను కూడా త‌గ్గించారు. దీంతో మ‌ద్యం అమ్మ‌కాలు పుంజుకున్నాయి. ప్ర‌భుత్వానికి ఆదాయం కూడా పెరిగింది.

అయితే.. ఇలా జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం పై ఓ ఇద్ద‌రు మంత్రులు.. అది కూడా ఒకే జిల్లాకు చెందిన మంత్రులు.. వ్యాఖ్య‌లు సంధించుకున్నారు. నేను చెప్పాను కాబ‌ట్టి.. సీఎం ధ‌ర‌లు త‌గ్గించార‌ని.. ఒక సీనియ‌ర్ మంత్రి వ్యాఖ్యానిస్తే.. ఎక్సైజ్ శాఖ చూసే.. మ‌రో మంత్రి.. త‌నే చెప్పాన‌ని.. మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గిస్తే.. రాష్ట్రానికి ఆదాయం వ‌స్తుంద‌ని.. అదేస‌మ‌యంలో పొరుగు రాష్ట్రాల నుంచి ర‌వాణా కూడా త‌గ్గిపోయి.. మ‌న‌కు ఇబ్బందులు త‌గ్గుతాయ‌ని వివ‌రించాన‌ని.. అందుకే ధ‌ర‌లు త‌గ్గించాన‌ని ఆయ‌న వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి.. మంత్రుల మ‌ధ్య మాట‌ల తూటాల‌కు అంత‌ర్గ‌త చ‌ర్చ‌కు కార‌ణ‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: