దేశంలోనే అతి పెద్ద రాష్ట్రాన్ని మరోసారి సొంతం చేసుకోవాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి. మరో నెల రోజుల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.... అంతా అనుకూలంగా ఉందని ధీమాతో ఉన్న కమలం పార్టీ నేతలకు ఇప్పుడు పెద్ద షాక్ తగులుతోంది. ముగ్గురు మంత్రులు, ఏడుగులు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కాషాయా పార్టీ నేతలకు దిమ్మ తిరిగినట్లుగా అయ్యింది. ఆ వెంటనే తమ మార్క్ రాజకీయాన్ని చూపించారు. పార్టీ మారిన మంత్రిపై ఏడేళ్ల క్రితం కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద తలవంపులుగా మారింది. పార్టీకి గుడ్ బై చెప్పిన నేతల్లో ప్రసాద్ మౌర్య ఒకరు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ పరిపాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు మౌర్య చేసిన కామెంట్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పిన నేతలంతా త్వరలోనే అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఇప్పుడు తాజాగా ప్రసాద్ మౌర్య యోగీ సర్కార్‌కు సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో యూపీలో బీజేపీని కేవలం 45 స్థానాలకు మాత్రమే పరిమితం చేస్తామని సవాల్ చేశారు మౌర్య. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని జోస్యం చెప్పారు మౌర్య. 2017కు ముందు యూపీలో బీజేపీ కేవలం 45 స్థానాలు మాత్రమే ఉన్నాయని... ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందన్నారు. యోగి పరిపాలనలో యూపీలో వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీల పట్ల చిన్న చూపు చూసినట్లు మౌర్య ఆరోపించారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాతే... తనపై కేసులు ప్రభుత్వానికి, పోలీసులకు గుర్తుకు వచ్చాయా అని మౌర్య నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో యూపీలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సరిగ్గా ఎన్నికలకు ముందు వరకు పార్టీలో పదవులు అనుభవించిన నేతలు... ఇప్పుడు ఇలా వ్యవహరించడంతో బీజేపీ నేతలకు ఏ మాత్రం పరిస్థితి అర్థం కావడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: