సంక్రాంతి పండుగ అంటే చాలు... ఎన్నో ప్రత్యేకతలు... మరెన్నో విశిష్టతలు. కొత్త అల్లుళ్లు, పిండి వంటలు, కోడి పందేలు, గంగిరెద్దులు, హరిదాసులు, కొత్త పంట... ఇలా ఎన్నో మరెన్నో. సంక్రాంతి పండుగ కోసం దేశ విదేశాల నుంచి కుటుంబ సభ్యులు తమ ఆత్మీయులను కలుసుకునేందుకు వస్తుంటారు. ఇక తెలుగు వారి పెద్ద పండుగ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది గోదావరి జిల్లాలు. సంక్రాంతి పండుగ మూడు రోజులు గోదావరి జిల్లాల్లో సందడే సందడి. ఆ కోలాహలం మాటల్లో వర్ణించలేనటువంటింది. పండుగ సెలవులు వస్తున్నాయంటే చాలు... నగర దారులన్నీ కూడా పల్లె బాట పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరం నిర్మానుషంగా మారిపోయింది. గోదావరి జిల్లాలు బంధువల రాకతో కళకళలాడుతున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కోడి పందేల కోసం ఈ మూడు రోజుల పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ ప్రాంతానికి వస్తుంటారు. ముఖ్యంగా వేల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి.

ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సమయంలో కోడి పందేలు నిర్వహించడం ఆనవాయితీ. ముఖ్యంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడి పందేల కోసం బరులు ఏర్పాటు చేస్తారు. అయితే ఓ వైపు హైకోర్టు హెచ్చరికలు, పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ... ప్రతి ఏటా కోడి పందేలు మాత్రం యదేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కోడి పందేలు, జూదం, పేకాట, గుండాటకు ఎలాంటి అవకాశం లేదని పోలీసులు చెప్పడం... ఆ తర్వాత మళ్లీ జరగడం... ఇదో ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి మాత్రం కోడి పందేల్లో కోడికి కత్తి కడితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. కత్తి లేకుండా పందేలు నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కడైనా కత్తి కట్టినట్లు తమ దృష్టికి వస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటున్నారు పోలీసులు. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఈ సారి డ్రోన్ కెమెరాల సాయంతో మారు మూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: