ఏపీ సీఎం జగన్ ఎందుకో కరోనా కట్టడి విషయంలో ఈసారి వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. అయితే జగన్ అంచనా ఈ పాటికే తప్పింది. ఏపీలో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. పండగ ముందు రోజే కేసుల సంఖ్యలో భారీ తేడా కనిపించింది. ఇప్పుడు పండగకి కూడా వదిలేస్తే.. ఇక ఆపడం ఎవరి వల్లా కాదు. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నా, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువగా ఉండటం, మరణాల సంఖ్యలో ఆస్థాయి పెరుగుదల లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ సహా ఇతరత్రా ఆంక్షలు కఠినతరం చేశాయి కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు. ఏపీ కూడా ఈ విషయంలో కాస్త ముందున్నా.. నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గింది. నైట్ కర్ఫ్యూ అని ప్రకటించిన 24గంటల లోపే వెనక్కు తగ్గారు అధికారులు. నైట్ కర్ఫ్యూని వాయిదా వేశారు. అయితే పండగ తర్వాత కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించారు.

పండగ సందడి తగ్గించడం ఇష్టం లేకే..?
నైట్ కర్ఫ్యూ పెడితే పండగ సందడి కచ్చితంగా తగ్గిపోతుంది, రాత్రి వేళ ప్రయాణాలకు, షాపింగ్ లకు ఎవరూ పెద్దగా ఇష్టపడరు. కర్ఫ్యూ ఆంక్షల నేపథ్యంలో షాపులు కూడా త్వరగా మూసేసుకోవాల్సి వస్తుంది. దీంతో సహజంగానే వ్యాపారం పడిపోతుంది. పండగ వేళ వ్యాపారంపై చాలామంది ఆశ పెట్టుకుని ఉంటారు. అటు కస్టమర్లు కూడా షాపింగ్ తో సందడిగా ఉంటుందని భావిస్తారు. ఈ దశలో పండగ సందడిని తోసిపుచ్చలేక ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విషయంలో వెనక్కి తగ్గింది.

నైట్ కర్ఫ్యూ పెడితే కేసులు తగ్గుతాయని ఎవరూ భావించరు కానీ, కాస్తలో కాస్త ఉపశమనం కలుగుతుందనేమాట వాస్తవం. అయితే ప్రస్తుతం ఏపీలో నైట్ కర్ఫ్యూ లేదు. పండగ తర్వాత పెట్టినా ఫలితం ఉంటుందని అనుకోలేం. ఎందుకంటే ఇప్పటికే కరోనా చాపకింద నీరులా చుట్టేస్తోందని అంటున్నారు. పండగ వేళ ఆ వాతావరణం కేసులు పెరగడానికి మరింత కారణం అవుతుంది. ఇప్పటికే ఆలస్యం చేసిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడిక సంచలన నిర్ణయం తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: