నిన్న‌టివేళ ప‌ల్నాటి హ‌త్య రాష్ట్రాన్ని ఉలిక్కి ప‌డేలా చేసింది. ఎన్న‌డూలేనంత ఉద్రిక్త‌త నెల‌కొంది. వైసీపీ,టీడీపీ వ‌ర్గాలు ఒక‌దానినొక‌టి తిట్టుకున్నాయి. ఈ నేప‌థ్యంలో హ‌త్య ఎలా జ‌రిగింది అన్న‌ది వీడియో ఎవిడెన్స్ ఉంది. కానీ అరెస్టుల‌పైనా త‌రువాత చ‌ర్య‌ల‌పైనా అనుమానాలు మాత్రం పుష్క‌లంగా వ్య‌క్తం అవుతున్నాయి విప‌క్షం నుంచి...


నిన్న‌టి వ‌ర‌కూ రాజ‌కీయ హ‌త్య‌లు అన్న‌వి లేనేలేవ‌ని అంతా ఊపిరిపీల్చుకుంటున్న త‌రుణంలో అత్యంత కిరాత‌కంగా గుంటూరులో గుండ్ల‌పాడులో జ‌రిగిన హ‌త్య మాన‌వీయ విలువ‌ల‌ను కాల రాస్తోంది. మ‌నుషులు న‌డిరోడ్డు మీదే నెత్తురోడి పోతుంటే, క‌త్తుల యుద్ధంలో చివ‌రి శ్వాస విడిచి వెళ్తుంటే మ‌న నాయ‌కుల గొడవ‌లు, వాటి తీవ్ర‌త‌లు మాత్రం త‌గ్గ‌డం లేదు. పాత క‌క్ష్య‌ల కార‌ణంగానే ఆయ‌న హ‌త్య‌కు గుర‌య్యారు అనిచెప్ప‌డం సులువు నిరూపించ‌డమే క‌ష్టం. హ‌త్య‌కు కార‌కులయిన ఆ ఏడుగురు వైసీపీ నాయ‌కుల‌నూ క‌ట‌క‌టాల పాల్జేస్తారా?



ప‌ల్నాటి హ‌త్య‌కూ రాజ‌కీయాల‌కూ సంబంధ‌మే లేద‌ని అంటున్నారు విప్ పిన్నెల్లి రామ‌కృష్ణా రెడ్డి. కానీ మృతుని కుమారుడి ఆరోప‌ణ‌లు వేరేగా ఉన్నాయి. వీటిలో ఏది నిజం?ఎంత నిజం? పోలీసులే తేల్చాలి.మ‌రోవైపు విప‌క్ష నేత ఈ హ‌త్య‌పై భ‌గ్గు మ‌న్నారు.తాను త‌లుచుకుంటే రౌడీయిజం అంతం చేయ‌డం అంత క‌ష్ట‌మేం కాద‌ని అన్నారు.తాము అధికారంలో ఉన్న‌ప్పుడు ఇలానే చేస్తే ఇవాళ వైసీపీ నాయ‌కులు ఉండేవారా అని ప్ర‌శ్నించారు.

ప‌ల్నాటి సీమ ప్ర‌శాంతంగానే ఉంది.పెద్ద‌గా గొడ‌వ‌లు లేవు. పెద్ద‌గా యుద్ధాలూ లేవు. గుంటూరు పౌరుషం అన్నది అన్నింటి ఉన్నా ఒక‌ప్ప‌టిలా తగువులు అయితే పెద్ద‌గా లేవు.కానీ నిన్న‌టి వేళ టీడీపీ లీడ‌ర్ తోట చంద్ర‌య్య (42) దారుణంగా హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ హ‌త్య వెనుక పాత క‌క్ష్య‌లేవో ఉన్నాయ‌ని ఓ వ‌ర్గం అంటోంది. అంత‌కు మించి హ‌త్యకు సంబంధించి ఎటువంటి కార‌ణాలూ లేవ‌ని అంటోంది. ప‌ట్ట‌ప‌గ‌లే అంద‌రి ముందే దారుణంగా,కిరాతకంగా హ‌త్య‌కు గుర‌యిన ఆయ‌న గ‌త కొద్ది కాలంగా మాచ‌ర్ల టీడీపీ ఇంఛార్జిగా ఉన్నారు.యాక్టివ్ మెంబ‌ర్ అని కూడా చెబుతున్నారు. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎంపీపీ శివ‌రామ‌య్య, ఆయ‌న కుమారుడు ఆదినారాయ‌ణ ఇంకా ఇంకొంద‌రిపై వైసీపీ స‌ర్కారు తీసుకునే చ‌ర్య‌లేంటి అన్న‌వి ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. హ‌త్య చేసిన వారంతా అధికార పార్టీ స‌భ్య‌లేన‌ని తేలిపోయాక జ‌గ‌న్ స‌ర్కారు తీసుకునే నిర్ణ‌యాల‌పై లెక్క‌కు మిక్కిలి ఆస‌క్తి నెల‌కొని ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: