ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ప్రస్తుతం వేగంగా మారుతున్నాయి. ప్రతి రోజు ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోవడంతో అటు రాష్ట్ర ప్రజలకే కాకుండా... ఇటు రాజకీయ విశ్లేషకులకు కూడా అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికి సరిగ్గా రెండున్నర ఏళ్లు దాటింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల గడువు ఉంది. అయితే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో పాటు... పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే మాట ఇప్పటికే చెప్పారు. దీంతో ఇప్పుడు అందరూ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అనే కోణంపైనే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో పొత్తులపై కూడా చర్చ జోరుగా సాగుతోంది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు మళ్లీ పొత్తు పెట్టుకుంటాయనే చర్చ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో షికారు చేస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి సమావేశం కావడం ఓ కీలక ఎత్తుగడగా అంతా భావిస్తున్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల వివాదం దాదాపు రెండు నెలలుగా సాగుతోంది. అయితే నిన్న మొన్నటి వరకు వాటిపై ఎలాంటి కామెంట్ చేసేందుకు కూడా చిరంజీవి ఆసక్తి చూపలేదు. పైగా.... తాను సినిమా పెద్దను కాదని కూడా కామెంట్ చేశారు. పరిశ్రమలో ఉన్న నలుగురిలో నేను కూడా ఒకడిని అని చెప్పేశారు. కానీ సడన్‌గా ఒక్కరే వచ్చి జగన్‌తో సమావేశం కావడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో ఖాళీ అవుతున్న వైసీపీ రాజ్యసభ స్థానాన్ని చిరంజీవితో భర్తీ చేయాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని వల్ల అటు మెగాస్టార్ అభిమానులను తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. అలాగే చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్‌కు కూడా చెక్ పెట్టవచ్చు. అదే సమయంలో... కాపు సామాజిక వర్గం నేతలు, ఓటర్లను తన వైపు ఆకర్షించేందుకు కూడా జగన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి జగన్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: