రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో గత కొంతకాలం నుంచి ఊహించని రీతిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి అన్న విషయం తెలిసిందే. యూరోపియన్ యూనియన్లో కలిసేందుకు సిద్ధమవుతున్న ఉక్రెయిన్ ను అడ్డుకునేందుకు రష్యా ఎంతగానో ప్రయత్నాలు చేస్తోంది. తమతోనే కలిసి ఉండాలి అంటూ రష్యా చెబుతూ ఉండటం గమనార్హం. లేదంటే దేశాన్ని ఆక్రమించుకుంటాము అంటూ హెచ్చరికలు జారీ చేస్తూ భారీగా సైన్యాన్ని కూడా మొహరిస్తుంది. తాము ఎవరి చెప్పుచేతుల్లో ఉండాలని అనుకోవడం లేదని.. తాము స్వతంత్రదేశంగా మాత్రమే ఉండాలని అనుకుంటున్నామని.. బానిసలుగా బ్రతకడానికి తమ దేశ ప్రజలు సిద్ధంగా లేరు అంటూ చిన్న దేశమైన ఉక్రెయిన్ వరుసగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉండడం గమనార్హం.



 అదే సమయంలో ఇక స్వతంత్ర దేశంగా ఉన్న ఉక్రెయిన్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ అగ్రదేశం గా కొనసాగుతున్న అమెరికా వరుసగా రష్యాకు హెచ్చరికలు జారీ చేస్తుంది. అయినప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో రోజురోజుకు యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇలా సరిహద్దుల్లో ఏర్పడిన ప్రతిష్టంభనను తీర్చేందుకు అమెరికా ఇప్పటికే రష్యాతో పలుమార్లు చర్చలు జరిపింది. మొదటి విడత చర్చల్లో భాగంగా ఇరు దేశాలకు సంబంధించిన అధికారులు మధ్య చర్చలు జరిగగా విఫలమయ్యాయి.



 ఇక ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మధ్య చర్చలు జరిగాయి. ఇక ఇరు దేశాల అధ్యక్షులు మధ్య చర్చలు సఫలం అవుతాయి అని అందరూ అనుకున్నారు. కానీ మళ్లీ చర్చలు విఫలం అయ్యాయి. ఇక ఇప్పుడు నాటో అధికారులు మరోసారి రష్యా ప్రభుత్వంతో ఉక్రెయిన్ వివాదం విషయంలో చర్చలు జరిపారు. ఈ చర్చలు కూడా ప్రస్తుతం విఫలం అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇక ఉక్రెయిన్ విషయంలో రష్యా రానున్న రోజుల్లో ఎలా వ్యవహరించబోతుంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏ క్షణంలోనైనా యుద్ధం తలెత్తే అవకాశం ఉంది అని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: