మొత్తానికి ముఖ్యమంత్రి పదవి మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నట్లున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తమ పార్టీయే అని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ బల్లుగుద్దకుండానే చెబుతున్నారు. అంత ధీమాగా ఎలా చెబుతున్నారంటే మళ్ళీ దానికి పెద్ద లాజిక్కేమీ ఉండదు.  పవనే సీఎం అవుతాడనటానికి రెండు ఆప్షన్లపై జనసేన పార్టీలో చర్చ జరుగుతోంది.




కారణాలు పైకి చెప్పకపోయినా బొలిశెట్టి అందుకనే పవనే సీఎం అని అంటున్నారు. మొదటి అవకాశమేమో మిత్రపక్షాలుగా ఉన్న తమతో చంద్రబాబునాయుడును కూడా కలుపుకుని ఎన్నికలకు వెళ్ళటం. అప్పుడు వీళ్ళ కూటమి గెలిస్తే పవన్నే సీఎం అభ్యర్ధిగా ప్రకటించటం. ఒకవేళ టీడీపీని కూడా కలుపుకుని వెళ్ళేపక్షంలో ముందుగానే ఆ విషయమై చంద్రబాబుతో చెప్పి ఒప్పించాలని జనసేనలో వాదన మొదలైందట. షెడ్యూల్ ఎన్నికలు 2024లో అయితే జనసేన మాత్రం 2023లోనే ఎన్నికలు జరుగుతాయని అనుకుంటోంది.




ఇక రెండో అవకాశం ఏమిటంటే బీజేపీ+జనసేన మాత్రమే ఎన్నికలకు వెళ్ళటం. మిత్రపక్షాలు గనుక ఓ 45 సీట్లు తెచ్చుకోగలిగితే టీడీపీ సహకారంతో పవన్ ముఖ్యమంత్రవుతారట. ఇక్కడ గమనించాల్సిందేమంటే బీజేపీ ఓటుబ్యాంకు కనీసం 1 శాతం కూడా లేదని అందరికీ తెలిసిందే. ఇక జనసేనకున్న ఓటు బ్యాంకు 5.4 శాతం. అంటే మొన్నటి ఎన్నికల్లో పై రెండు పార్టీలకు వచ్చిన ఓట్లశాతమిది. రేపటి ఎన్నికల్లో అయినా జనసేనకు ఎక్కువ ఓట్లు తెచ్చుకునే అవకాశం ఉందికానీ బీజేపీకైతే ఏమీలేదు.




జనసేన కూడా 5.4 శాతం ఓట్లను 10 శాతం చేసుకోగలదు లేకపోతే 15 శాతం చేసుకోగలదేమో. అంతేకానీ ఏకంగా 30 శాతమో లేకపోతే 40 శాతం ఓట్లో తెచ్చుకునేంత సీన్ లేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ 39 శాతం ఓట్లు తెచ్చుకుంటేనే వచ్చిన సీట్లు 23. అంటే ఓట్లశాతం పెంచుకున్నంత మాత్రాన ఉపయోగంలేదు తెచ్చుకోవాల్సింది సీట్లనే. కాబట్టి రెండుపార్టీలు ఎన్నిసీట్లు తెచ్చుకుంటాయో చూడాలి.




కూటమిలో టీడీపీ ప్రధాన భాగస్వామిగా ఉండగా సీఎం కుర్చీని చంద్రబాబు ఇంకోరికి అప్పగించే అవకాశమే లేదు. అందుకే రెండోఆప్షన్ కు మాత్రం కాస్త అవకాశముంది. అదేమిటంటే మిత్రపక్షాలు గనుక ఓ 40 సీట్లు తెచ్చుకుంటే టీడీపీ మద్దతుతో పవన్ సీఎం అయిపోవటం. అంటే కర్నాటకలో కుమారస్వామి సీఎం అయిపోయినట్లన్నమాట. జగన్మోహన్ రెడ్డిని అధికారానికి దూరంగా ఉంచేందుకు చంద్రబాబు దీనికి అంగీకరించే అవకాశముంది. మొత్తానికి సీఎం కుర్చీమీద పవన్ చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నట్లు అర్ధమైపోతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: