దేశమంతటా ఒమిక్రాన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఒమిక్రాన్ డెల్టా తరహాలో డేంజర్ కాకపోవడంతో దీన్ని పెద్ద సీరియస్‌గా ఎవరూ తీసుకోవడం లేదు. ఏపీలోనూ అదే పరిస్థితి నెలకొంది. అయితే.. ఇది నిన్నటి వరకూ ఉన్న సీన్.. కానీ ఇప్పుడు ఏపీలో ఒమిక్రాన్ ట్రెండ్ మారుతోంది. క్రమంగా ఒమిక్రాన్ కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా  ఎక్కువవుతోంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ వల్ల మరణాలు తక్కువగా నమోదవుతున్న మాట వాస్తవమే అయినా.. అలాగని ఒమిక్రాన్‌ను నిర్లక్ష్యం చేసే పరిస్థితి మాత్రం లేదు.


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య బాగానే పెరుగుతోంది. అలాగే ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా బాగానే పెరుగుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం..  గత డిసెంబర్‌లో 1381 మంది కొవిడ్ ఆస్పత్రుల్లో చేరితే.. కేవలం జనవరి 1 నుంచి 14 వరకు.. అంటే కేవలం 2 వారాల్లో 1400 మంది వరకూ ఆస్పత్రుల్లో చేరారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే... నెలాఖరుకు ఆస్పత్రుల్లో చేరే కేసులు రెండు రెట్ల వరకు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. . జనవరిలో ఇప్పటి వరకూ 20 వేల వరకూ కేసులు నమోదయ్యాయి.


ఇప్పటి వరకూ ఉన్న లెక్కల ప్రకారం కరోనా బాధితుల్లో 7.14 శాతం మంది ఆస్పత్రుల్లో చేరి ఉన్నారు. ప్రస్తుతానికి ఓకే.. కానీ.. ఒమిక్రాన్‌ మరింత విస్తరించి ప్రమాదకరంగా మారితే.. ఆస్పత్రుల్లో పడకలు సరిపోని పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు నిపుణులు.


ఒమిక్రాన్ మొదట్లో పట్టణాల్లోనే కనిపించేది.. ఇప్పుడు గ్రామాల్లోనూ అధిక సంఖ్యలో కేసులు వస్తున్నాయి. తొలి, మలి దశల కంటే ఈసారి వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. అందుకే ఒమిక్రాన్‌ ను లైట్‌గా తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా కేసులు పెరిగి.. ఆస్పత్రుల్లో చేరికలు మొదలైతే.. పరిస్థితులు ఇబ్బందికరంగా మారే ప్రమాదమూ పొంచి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: