ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పైనే అన్ని ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ తర్వాత... అందరి దృష్టి పంజాబ్ రాష్ట్రంపైనే ఉంది. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి... అధికారం దక్కించుకునేందుకు అటు భారతీయ జనతా పార్టీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా రైతుల్లో కాషాయ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. దీంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని... రైతులను, సిక్కులను ప్రసన్నం చేసుకునేందుకు మోదీ సర్కార్.... కీలక నిర్ణయం తీసుకుంది. సరిగ్గా నవంబర్ 19వ తేదీన సిక్కుల పవిత్ర గురువు గురునానక్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇదంతా ఎన్నికల కోసమే అని అంతా కొట్టి పారేశారు. మోదీ సర్కార్ పై అదే స్థాయిలో విమర్శలు కూడా చేశారు. చివరికి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులు రద్దు చేసినప్పటికీ..... కనీస మద్దతు ధరపై ప్రకటన చేయాలంటూ పట్టుపట్టాయి విపక్షాలు.

ఇదే సమయంలో పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం క్లిష్టంగానే కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణంగా పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యవహార శైలి మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తొలి నుంచి ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన సిద్ధూ... పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు వ్యతిరేకంగా పార్టీ అధిష్ఠానానికి కావాల్సినన్ని ఫిర్యాదులు చేశారు. దీంతో... చివరికి కెప్టెన్ అమరీందర్ సింగ్... తన పదవికి రాజీనామా చేశారు కూడా. ఆ తర్వాత ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ జిత్ చన్నీపై కూడా సిద్ధూ పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. దీంతో చివరికి రంగంలోకి దిగిన అధిష్ఠానం... ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇప్పట్లో ప్రకటించేది లేదని తేల్చి చెప్పేసింది. ఈ విషయం ఇప్పుడు సిద్ధూ వర్గానికి మింగుడు పడకుండా ఉంది. అటు ఆప్, ఇటు బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్న సమయంలో... అంతర్గత కుమ్ములాటలు కూడా హస్తం పార్టీ గెలుపుపై ప్రభావం చూపేలా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: