ధనసరి అనసూయ...అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు..కానీ సీతక్క అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఆమె ప్రజలకు చేసిన సేవలు వల్ల జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు...కరోనా, లాక్‌డౌన్ లాంటి సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు, ఆదివాసీలకు ఆమె అండగా నిలబడిన తీరు ప్రశంసనీయం. ఈరోజుల్లో సర్పంచ్ లాంటి చిన్నాచితక పదవులు వచ్చిన నాయకులే భూమి మీద ఆగరు. అలాంటిది ఒక ఎమ్మెల్యేగా ఉంటూ సామాన్య జీవితం గడుపుతూ..అదే సామాన్యులకు అండగా ఉంటూ వస్తున్నారు.

ఇలా ప్రజలకు ఎప్పుడు అండగా ఉండే సీతక్కకు ప్రజా మద్ధతు కూడా పెరిగింది...గతంతో పోలిస్తే ములుగులో సీతక్క బలం పెరిగింది. అసలు సీతక్క రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది...ఆమె నక్సలైట్ నుంచి ప్రజా నాయకురాలుగా ఎలా మారారనే విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపుతో ఆమె ప్రజా జీవితంలోకి వచ్చారు. అలాగే 2004లో తొలిసారి టీడీపీ నుంచి పోటీ చేసి ములుగు బరిలో ఓటమి పాలయ్యారు. ఇక 2009 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

తెలంగాణ వచ్చాక కూడా 2014లో టీడీపీ నుంచి ములుగు బరిలో ఓడిపోయారు. అయితే తర్వాత మారిన పరిస్తితుల నేపథ్యంలో ఆమె టీడీపీని వీడాల్సి వచ్చింది..రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. కాంగ్రెస్‌లోకి వెళ్ళినా సరే ఆమె...చంద్రబాబు పట్ల ఎంత విధేయతతో ఉంటారో అందరికీ తెలిసిందే.

ఇక 2018 ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ నుంచి ములుగులో గెలిచారు. అప్పుడు టీడీపీ సపోర్ట్ ఉండటం ఆమెకు కలిసొచ్చింది. అయితే ఇక్కడ నుంచే సీతక్క రాజకీయంగా ఎదిగారు. ప్రజల మనిషి అంటే ఏంటో నిరూపించారు. ఇప్పుడు తెలంగాణలో ఒక బలమైన నాయకురాలుగా అయ్యారు. అలాంటి సీతక్క మళ్ళీ ములుగు బరిలో నిలిచి గెలవడం సులువే అని చెప్పొచ్చు. సీతక్కకు టీఆర్ఎస్ గాని, బీజేపీ గాని చెక్ పెట్టడం కష్టమే.


మరింత సమాచారం తెలుసుకోండి: