తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త జోన్ల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో ఆయన సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ, అన్నిస్థాయిల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం వంటి అంశాలను అధ్యయనం కోసం నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పై పరిస్థితులను అధ్యయనం చేసి యాక్షన్ ప్లాన్ రెడీ చేసి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.


ఈ నలుగురు ఐఏఎస్‌ల కమిటీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ అండ్ కమిషనర్ శేషాద్రి అధ్యక్షత వహిస్తారు. ఈ కమిటీలో సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మహిళా శిశుసంక్షేమశాఖ కమిషనర్ దివ్య సభ్యులుగా ఉంటారు. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల బదిలీ ప్రక్రియపై ఇప్పటికే అనేక విమర్శలు ఉన్నాయి. కొందరు ఉద్యోగులు ఈ బదిలీలు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మొత్తం ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 38,643 మంది ఉద్యోగులను ఇప్పటికే ఉమ్మడి జిల్లాలలో సర్దుబాటు చేశారు. అందులో కేవలం 101 మంది తప్ప మిగిలిన 38,542 మంది ఉద్యోగులు తమ కొత్త స్థానాల్లో చేరిపోయారు. ఇప్పుడు ఆయా జిల్లాల్లో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి అవసరమైన చర్యలు తీసుకోవడంపైనా కొత్త కమిటీ అధ్యయనం చేస్తుంది.


అలాగే జిల్లాల్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, జిల్లా పోలీసు భవనాల నిర్మాణం పూర్తవుతున్నాయి. జిల్లాలలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును ఇంకా మెరుగు పరచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త కమిటీ వీటిపైనా అధ్యయనం చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: