లాక్ డౌన్ హీరో సోనూ సూద్ ఏపీకి విరాళంగా ఇచ్చిన ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయడంలేదు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి గతంలో సోనూ సూద్ ఆక్సిజన్ ప్లాంట్ విరాళంగా ఇచ్చారు. కోటిన్నర రూపాయల ఖర్చు చేసి అక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ ఆక్సిజన్ ప్లాంట్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది.

థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో..
సెకండ్ వేవ్ సమయంలో మెడికల్ ఆక్సిజన్ కొరత ఏ స్థాయిలో ఉందో అందరికీ ప్రత్యక్షంగా అనుభవంలోని విషయమే. ఆక్సిజన్ కొరతతో చాలామంది ఆస్రత్రి బెడ్ పై అవస్థలు పడ్డారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆక్సిజన్ ని దిగుమతి చేసుకుని మరీ పేషెంట్లకు అందించింది. అయితే ఇప్పుడు థర్డ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ గురించి ఎవరూ అంతగా పట్టించుకున్నట్టు లేదు. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో ఆక్సిజన్ గురించి ఆలోచించడం మానేశారు. ఈ క్రమంలో సోనూ సూద్, నెల్లూరు జిల్లాకు అందించిన ఆక్సిజన్ ప్లాంట్ నిరుపయోగంగా ఉన్నా దానిపై ఎవరూ హడావిడి పడటంలేదు.

సోనూ సూద్ ఇచ్చిన ఆక్సిజన్ ప్లాంట్ కి సంబంధించి సాంకేతిక సమస్య ఉందని చెబుతున్నారు వైద్యులు. రిపేర్ కోసం ఇప్పటికే తయారీ సంస్థకు సమాచారమిచ్చామని, వారు ఇంకా రాలేదంటున్నారు. అయితే అత్యవసరం అయిన ఆక్సిజన్ విషయంలో మరింత శ్రద్ధ చూపెట్టి ఉంటే బాగుంటుందని అంటున్నారు స్థానికులు.

నియోజకవర్గ కేంద్రాల్లోని పెద్దాసుపత్రుల్లో ప్రభుత్వం నేరుగా ఆక్సిజన్ ప్లాంట్లను వినియోగంలోకి తెచ్చింది. అదే సమయంలో లిక్విడ్ ఆక్సిజన్ రవాణా కూడా ఇప్పుడు సజావుగానే ఉంది. దీంతో సోనూ సూద్ ఆక్సిజన్ ప్లాంట్ పనితీరుని ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు లేరు. అయితే ఆక్సిజన్ కొరత వస్తే మాత్రం ఇలాంటి వాటి వల్ల ఉపయోగం ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకముందే ఆక్సిజన్ ప్లాంట్లను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: