దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి... సొంతంగా పార్టీ స్థాపించారు. పార్టీ ప్రారంభించిన నాటి నుంచి తనదైన దూకుడుతోనే రాజకీయాల్లో రాణించారు. అధికారమే లక్ష్యంగా విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు జగన్. అయితే.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితం అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కానీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండేళ్ల పాటు పాదయాత్ర నిర్వహించారు. నేతలకు, ప్రజలకు, రైతులకు, ఉద్యోగులకు హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు అమలు చేస్తామన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ విజ్ఞప్తి చేశారు. మాట తప్పను.. మడమ తిప్పను అంటూ భరోసా ఇచ్చారు. ఎన్నికల కోసం ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇవ్వకుండా.... కేవలం రెండు పేజీలతో మేనిఫెస్టో రూపొందించారు. నవరత్నాల పేరుతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామన్నారు.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఇచ్చిన మాటను తప్పినట్లుగా కనిపిస్తోంది. ప్రజలకు సంక్షేమ పథకాల అమలు కోసం ఓ ప్రత్యేక క్యాలెండర్ రూపొందించారు. ప్రతి ఏటా జనవరి ఒకటిన నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు, పీఆర్‌సీ అమలు వంటి హామీలు ఇచ్చారు. అలాగే పార్టీ నేతలకు కూడా అమాత్య పదవులు ఇస్తామని మాట ఇచ్చారు జగన్. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది హామీలు నిలిబెట్టుకున్న జగన్ సర్కార్... రెండేళ్లు దాటిన తర్వాత నుంచి పరిస్థితి మారిపోయింది. ప్రతి ఏటా సంక్రాంతి నెలకు ముందు ఇస్తామన్న అమ్మఒడి పథకం ఇప్పుడు ఏకంగా ఆరు నెలలు వాయిదా వేసింది ప్రభుత్వం. అలాగే వైఎస్ఆర్ నేస్తం పేరుతో 45 ఏళ్లు దాటిన మహిళలకు అందించే 15 వేల రూపాయల పథకం కూడా వాయిదే పడింది. ఇక సీపీఎస్ రద్దు అసాధ్యం అని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు. ఇక పీఆర్‌సీ విషయంలో అయితే... ప్రస్తుతం ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆందోళన బాట పట్టారు. దీంతో ప్రస్తుత జగన్ సర్కార్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: