ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారిపోయాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఇచ్చిన హామీలే ఇప్పుడు ఆయనకు పెద్ద గుదిబండలా మారాయి. నాటి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సమయంలో ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చేశారు వైఎస్ జగన్. సీపీఎస్ రద్దు, పీఆర్‌సీ అమలు వంటి ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీపీఎస్ రద్దు అసాధ్యం అని తేల్చేశారు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక పీఆర్‌సీ కోసం కూడా దాదాపు రెండున్నర ఏళ్ల పాటు ఎదురుచూశారు ఉద్యోగులు. చివరికి ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ సాటి ఉద్యోగులే ఆరోపణలు చేశారు. దీంతో... చివరికి రంగంలోకి దిగారు ఉద్యోగ సంఘాల నేతలు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. సమ్మె నోటిసు ఇచ్చారు. చివరికి ప్రభుత్వం నుంచి హామీ రాబట్టారు.

అయితే ఇప్పుడు ఉద్యోగుల పీఆర్‌సీ వ్యవహారం ఉద్యోగ సంఘాల నేతల మెడకు ఉచ్చులా మారింది. ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాల నేతలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. కానీ ప్రభుత్వం చెప్పినట్లుగానే నేతలంతా వ్యవహరించారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఉద్యోగ సంఘాల నేతలను ఇరుకున పడేశాయి. పీఆర్‌సీ కారణంగా ఉద్యోగులకు జీతాలు పెరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితి అంతా రివర్స్ అయ్యింది. నిన్న మొన్నటి వరకు ఏ నోటితో అయితే జగన్ సర్కార్‌పై ప్రశంసలు కురిపించారో... ఇప్పుడు అదే నోటితో ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం... తమ సంఘం సభ్యుల నుంచే వారిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మా కోసం పోరాటం చేయని నేతలతో మాకు పనేంటి అనే విమర్శలు కూడా ప్రస్తుతం అన్ని సంఘాల నేతలపై వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు చివరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి తెలత్తింది. దీంతో నిన్న మొన్నటివరకూ ప్రభుత్వాన్ని పొగిడిన నేతలే ఇప్పుడు సర్కార్ ను టార్గెట్ చేయక తప్పని పరిస్దితికి వచ్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: