ప్ర‌శాంత‌త‌కు ఆన‌వాలుగా నిలిచిన శ్రీ‌కాకుళం న‌గరంలో ఉన్న‌ట్టుండి అల‌జ‌డులు రేగాయి.అందుకు కార‌ణాలు ఏవ‌యినా ఇది ఒక సుపారీ అని తేలిపోయింది.ఇందుకు సంబంధించి ఇంకా  పూర్తి వివ‌రాలు వెలుగులోకి రావాల్సి ఉండ‌గా,పోలీసు ద‌ర్యాప్తు ప్ర‌స్తుతం ముమ్మ‌రంగా సాగుతున్నందున వారే సిస‌లు విషయం వెల్ల‌డించాల్సి ఉంది.. లోగుట్టు తేల్చాల్సి కూడా ఖాకీలే!


ఆర్థిక లావాదేవీలే అస‌లు కార‌ణం అని కొంద‌రు అంటుండ‌గా,ఇసుక అమ్మ‌కాల్లో వాటాలు తేల‌క హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డార‌ని ఇంకొంద‌రు చెబుతున్నారు. ఇదీ నిన్న రాత్రి వేళ జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసుల నుంచి ప్రాథ‌మికంగా అందుతున్న స‌మాచారం.శ్రీకాకుళం లాంటి చిన్న‌పాటి న‌గ‌రంలో ఇటువంటి ఘ‌ట‌న‌కు ఆస్కారం ఉందా అని ఆశ్చ‌ర్య‌పోయేంత‌లా గ‌న్ క‌ల్చ‌ర్ హ‌ల్ చ‌ల్ చేయ‌డ‌మే ఇప్పుడిక విడ్డూరం.


వాస్త‌వానికి శ్రీ‌కాకుళం జిల్లాలో మంగ‌ళ‌వారం రాత్రి 8 వ‌ర‌కూ ఏం జ‌ర‌గ‌లేదు.8 త‌రువాత కాల్పుల చ‌ప్పుళ్లు కొంద‌రికే వినిపించాయి.అనూహ్య రీతిలో జ‌రిగిన ఈ కాల్పులు ఓ స‌ర్పంచ్ పై జ‌ర‌గ‌డం, ఆయ‌న తృటిలో త‌ప్పించుకోవ‌డం ఓ సంచ‌ల‌న వార్త కాగా,అస‌లు ఇంత వ‌ర‌కూ విష‌యం లాగిందెందుక‌ని పోలీసులు ద‌ర్యాప్తు సాగిస్తూ కొన్ని చిక్కు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతుకుతున్నారు. ఇందుకు కార‌ణాలు ఇప్ప‌టిదాకా పెద్ద‌గా వెలుగులోకి రాలేదు.ఆస్తిత‌గాదాలా లేదా భూ వివాదాలా అన్న‌వి కూడా ఇంకా తెలియాల్సి ఉన్నాయి.గొడ‌వ ఏద‌యినా గ‌న్ ఎవ‌రిది బుల్లెట్లు ఎవ‌రివి అన్న‌దే పెద్ద డౌట్. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ రామ‌చంద్రాపురం స‌ర్పంచ్ గొలివి వెంక‌ట ర‌మ‌ణ పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం ఒక సుపారీ గానే ప‌రిగ‌ణిస్తున్నారు పోలీసులు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా గ‌న్ క‌ల్చ‌ర్ జిల్లాలో క‌నిపించ‌డం,ఉన్న‌ప‌ళాన వెలుగు చూడ‌డంతో పోలీసులతో పాటు జిల్లా ప్ర‌జ‌లు కూడా ఉలిక్కిప‌డ్డారు.


ఇప్ప‌టికే ఘ‌ట‌నా స్థ‌లంలో క్లూస్ టీం కొన్ని ఆధారాలు సేక‌రించినా కూడా కేసుకు సంబంధించి మ‌రికొన్ని వివ‌రాలు అందాల్సి ఉంద‌ని తెలుస్తోంది.మాఫియా క‌ల్చ‌ర్ అన్న‌ది ఎక్క‌డో ఉన్న ముంబ‌య్ లాంటి న‌గ‌రాల్లో తిష్ట వేసుకుంద‌ని చదువుతుంటాం కానీ  చాలా మారుమూల ఊళ్ల‌లో కూడా ఇటువంటి హ‌త్యాయ‌త్నాలు,కిరాయి మూక‌ల అల‌జ‌డులు న‌మోదు అవ‌డం చూసి పోలీసులే విస్తుబోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: