కరోనా కేసులు దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్నాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో రెండు మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు స్థాయిని దాటింది. ఏపీలో పదివేలకు పైగా కేసులు బయటపడటంతో అధికారులు షాకయ్యారు. నైట్ కర్ఫ్యూని కాస్త ముందుగానే అమలులో పెట్టడం మంచి నిర్ణయం అని అంటున్నారు. అదే సమయంలో అసలు లాక్ డౌన్ పెట్టే అవకాశాలున్నాయా అనే అనుమానాలు కూడా బయలుదేరాయి.

వ్యాపార వర్గాల్లో దిగులు...
గతంలో లాక్ డౌన్ పెట్టడం వల్ల కొంతమంది ఎంతగా లాభపడ్డారో, మరికొందరు అంతగా నష్టపోయారు. ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో వస్తువుల్ని బ్లాక్ మార్కెట్ కి తరలించి సొమ్ము చేసుకున్నవారు బాగా లాభపడ్డారు. అదే సమంయలో సామాన్య వర్తకులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగస్తులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, లేదా సెలవల్లోనే జీతాలు తీసుకునేవారు. కానీ వ్యాపారులకు ఉదయం షాపు తెరిస్తేనే జీవనం. లాక్ డౌన్ సమయంలో నిబంధనలతో వారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

వాట్సప్ లో తప్పుడు ప్రచారం..
అదిగో లాక్ డౌన్, ఇదిగో లాక్ డౌన్. ఆ ఊరిలో లాక్ డౌన్, ఈ ఊరిలో లాక్ డౌన్ అంటూ వాట్సప్ లో తప్పుడు ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు పెరుగుతున్న కేసుల కారణంగా లాక్ డౌన్ విధిస్తారేమోనన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఈ దశలో అసలు ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి. ప్రజలయితే దేనికయినా సిద్ధంగా ఉండాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పటికే నైట్ కర్ఫ్యూతో ఏపీలో నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీంతో రాత్రి పూట జనసంచారం తగ్గిపోయింది. రాత్రి 11 నుంచి కర్ఫ్యూ అమలులోకి వస్తున్నా, 10 తర్వాత ఎక్కడా ఏ షాపులో కూడా సందడి కనిపించడంలేదు.

కేసులు మరింతగా పెరిగితే ఏం చేయాలి..?
ఓవైపు కేసులు పెరుగుతున్నా, మరోవైపు ఇన్ పేషెంట్ల సంఖ్య పెరగకపోవడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోంది. అయితే ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరిగితే అప్పుడేంచేయాలని అని ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటినుంచే ఆస్పత్రి బెడ్లు సిద్ధం చేసుకుంటున్నాయి, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుచుకుంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: