నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆయనకు వరుసకు చిన్నాన్న అయ్యే రూప్ కుమార్ యాదవ్ పేరు మారుమోగిపోతున్నాయి. అనిల్, రూప్ కుమార్ కి మధ్య వ్యవహారం చెడిపోయిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనిల్ జలవనరుల శాఖ మంత్రిగా ఉంటే, రూప్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ అనిల్ వ్యవహారాలన్నీ రూప్ కుమారే చూసుకునేవారు. కానీ ఇప్పుడెందుకో వారిద్దరికీ బెడిసిందని అంటున్నారు.

ఆ వార్తల్లో నిజమెంత..?
మంత్రి అనిల్, రూప్ కుమార్ యాదవ్ మధ్య విభేదాలు వచ్చాయని, రూప్ కుమార్ వ్యవహార శైలి నచ్చకే మంత్రి ఆయనను దూరం పెట్టారని కథనాలు వినిపిస్తున్నాయి. ఓ సెక్షన్ మీడియా దీనిపై విపరీతంగా ఫోకస్ పెట్టింది. ఇటీవల కాలంలో మంత్రి అనిల్ కి స్థానిక నాయకులకు విభేదాలు వచ్చాయనే విషయాలను కూడా ప్రస్తావిస్తూ ఈ వ్యవహారాన్ని హైలెట్ చేస్తోంది. గతంలో జరిగిన లావేదేవీల వల్లే వారిద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని, అవిప్పుడు తారా స్థాయికి చేరుకున్నాయనేది ఆ వార్తల సారాంశం. మరి దీనిలో నిజమెంతో తేలాల్సి ఉంది.

మంత్రి అనిల్, ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్, ఇటీవల ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిద్దరూ ఎక్కడా కలిసినట్టు కనిపించలేదు, అదే సమయంలో వారి మధ్య విభేదాలున్నట్టు కూడా ఎవరూ నేరుగా మాట్లాడలేదు. అసలు అనిల్ వర్గం కానీ, రూప్ కుమార్ వర్గం కానీ ఈ విషయంపై స్పందించడంలేదు. అందరూ సైలెంట్ గానే ఉంటున్నారు. ఈ దశలో మరి ఈ పుకార్లు ఎందుకో తెలియడంలేదు. సహజంగా మంత్రి అనిల్ తనపై సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు, అదే స్థాయిలో సమాధానం చెబుతుంటారు, వైరి వర్గాల నోళ్లు మూయిస్తుంటారు. కానీ ఈ విషయంలో అనిల్ కూడా సైలెంట్ గా ఉన్నారు. తనకు, తన బాబాయ్ కి మధ్య వైరం ఉందంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించలేదు, అలాగని సమర్థించనూ లేదు. వైసీపీ వర్గాలు మౌనంగా ఉండటంతో.. విపక్షాలు దీన్ని మరింతగా హైలెట్ చేస్తున్నాయి. మరి ఈ వివాదంపై ఎవరైనా స్పందిస్తారా..? ఎలా స్పందిస్తారు..? అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: