ఏపీలోని జగన్ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు ఉత్తర్వులు జారీ చేసినా పట్టించుకోరా అని సుప్రీంకోర్టు నిలదీసింది.  కోర్టులు చెప్పేదాకా స్పందించే అలవాటు లేదా అని కడిగేసింది. ప్రభుత్వానికి స్పందించే గుణం లేకుండా పోయిందా అని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.


ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కొవిడ్‌ మృతుల పరిహారం కోసం 41 వేల 292 దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తుల్లో 34 వేల 819 దరఖాస్తులకు పరిహారం పొందే అర్హత ఉందని నిర్థారించారు. ఆ దరఖాస్తుల్లో 23 వేల 895 మందికి పరిహారం ఇచ్చారు. ఇంకా 10 వేల 984 మందికి మాత్రం పరిహారం ఇవ్వలేదు. ఈ విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో నిన్న సీఎస్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ఎదుట హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆగ్రహంతో చిన్నబోయిన సీఎస్‌.. అందుకు క్షమాపణలు చెప్పారు.


కరోనా మృతుల కుటుంబాల్లో అర్హులకు పరిహారం చెల్లించకపోవడం అంటే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నిర్లక్ష్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీఎస్‌ బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు హాజరవ్వాలని.. ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇచ్చుకోవాలని జస్టిస్‌ ఎంఆర్‌ షా ఆదేశించారు. దీంతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు.


ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇస్తూ.. చెల్లించాల్సిన క్లెయిమ్‌లు 10 వేల 894 మాత్రమే ఉన్నాయని.. అర్హమైన అన్నింటినీ క్లియర్‌ చేయడానికి 2 వారాల సమయం కావాలని కోర్టును అడిగారు. ప్రతిదీ కోర్చే చెప్పాలా.. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోరా అని కోర్టు మందలించింది. ఇదే సమయంలో సీఎస్‌ సమీర్‌శర్మ కోర్టుకు క్షమాపణలు తెలిపారు. తాను  వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుని పరిహారం అందేలా చూస్తానన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: