రష్యా... తన పొరుగున ఉన్న ఉక్రెయిన్‌పై యుద్ధానికి సిద్ధం అవుతోందా.. ఇప్పటికే సైబర్ దాడులతో ఆ దేశాన్ని పరోక్షంగా అతలాకుతలం చేస్తున్న రష్యా.. ఇక నేరుగా యుద్ధం చేయబోతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. రష్యా తన సరిహద్దుల వెంబడి భారీగా సైనిక బలగాలను మోహరిస్తోంది. రష్యా.. గత రెండు నెలలుగా సుమారు లక్ష మంది సైనికులను సరిహద్దులకు చేర్చింది. అలాగే యుద్ధట్యాంకులు, సాయుధ సామగ్రిని రష్యా సరిహద్దలకు పంపింది. ఈ విషయాన్ని అమెరికా నిఘా సంస్థ సీఐఏ కూడా ధ్రువీకరించింది.


అంతే కాదు.. రష్యా పంపిన సైనికుల సంఖ్య దాదాపు 2 లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తోంది. విచిత్రం ఏంటంటే..  ఈ విషయాన్ని రష్యా కూడా ఖండించడం లేదు. అయితే.. అందుకు కుంటి సాకులు చెబుతోంది. దేశ సరిహద్దుల వెంబడి రవాణా సౌకర్యాలను అంచనా వేయడానికి మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్నామని వంకలు చెబుతోంది. అత్యవసర వేళల్లో సైనిక సామగ్రి తరలింపు కోసం ఉత్తుత్తి డ్రిల్‌ చేస్తున్నామని రష్యా చెబుతున్న విషయాన్ని ప్రపంచ దేశాలు నమ్మడం లేదు.


అసలు.. రష్యాకూ ఉక్రెయిన్‌కు గొడవ ఎందుకు వచ్చిందో పరిశీలిద్దాం.. ఉక్రెయిన్ అన్నది గతంలో సోవియట్‌ యూనియన్‌లో భాగం.. ఆ తర్వాత సోవియట్ యూనియన్ విచ్చిన్నం తర్వాత స్వతంత్ర్యంగా ఉంటోంది. అయితే ఉక్రెయిన్ చాలా వ్యూహాత్మక ప్రాంతం. ఈ ఉక్రెయిన్ కు చెందిన క్రిమియా ద్వీపాన్ని రష్యా దాదాపు 8 ఏళ్ల క్రితం ఆక్రమించుకుంది. దానికి ప్రజాభిప్రాయ సేకరణ అనే ముసుగులో ఈ అక్రమణ సాగింది. ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. మరోవైపు.. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం దక్కబోతోందన్న ప్రచారం సాగుతోంది.


ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం దక్కడం రష్యాకు ఏమాత్రం ఇష్టం లేదు. అదే జరిగితే.. రష్యా భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆ దేశం భావిస్తోంది. ఈ పరిణామాలన్నీ రష్యాకు ఉక్రెయిన్ పై కోపం పెంచాయి. ఈ నెలలోనే ఉక్రెయిన్‌ ప్రభుత్వంలోని కీలక విభాగాల్లో డేటా చోరీ అయ్యింది. ఇది రష్యా పనే అని ఉక్రెయిన్ భావిస్తోంది. మరి రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతలు ఎటు దారి తీస్తాయో..?

మరింత సమాచారం తెలుసుకోండి: