పీఆర్సీపై తగ్గేది లేదంటున్నారు జగన్, పరోక్షంగా జీతాలు పెంచేది లేదని తేల్చి చెప్పబోతున్నారు. ఈరోజు కేబినెట్ భేటీలో ఈ విషయంపై క్లారిటీ రాబోతోంది. కేబినెట్ భేటీతో తమకు అనుకూలమైన పరిష్కారం దొరుకుతుందని ఉద్యోగులు ఆశిస్తున్న వేళ, అలాంటి పరిణామాలేవీ ఉండబోవని ముందే హింట్ వచ్చేసింది. నిన్న మంత్రులంతా ముక్త కంఠంతో ఉద్యోగులకు హితబోధ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. అదే సమయంలో ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దని కూడా సూచించారు. అంటే.. ప్రతిపక్షాల సలహాలు సూచనలతో ఉద్యోగులు అసంబద్ధంగా సమ్మెకు పోతున్నారనేది ప్రభుత్వం ఆలోచన.

కష్టకాలంలో ఇంతకంటే ఇంకేం చేస్తాం..
పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ముందునుంచీ ఓ క్లారిటీతో ఉంది. కరోనా కాలంలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. దీంతో పీఆర్సీ అనుకున్న స్థాయిలో ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కమిటీలమీద కమిటీలు వేసి, చివరకు రోజులతరబడి సాగదీసి మరీ అంతకంటే ఇవ్వలేమన్నారు. ఆ తర్వాత హెచ్ఆర్ఏ లో కోతపడటంతో ఉద్యోగుల కడుపుమండింది. రోడ్లెక్కారు. కానీ ప్రభుత్వం దగ్గర ప్రత్యామ్నాయం లేదు. ఒకవేళ అదే ఉంటే.. ఈపాటికే సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ అయ్యేది. అటు వారినీ సంతృప్తి పరచలేక, ఇటు పాత ఉద్యోగులకీ పీఆర్సీ ఇవ్వలేక జగన్ సతమతం అవుతున్నారు.

ఇదే ఫైనల్..
ఇప్పటికే ఓసారి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కలెక్టరేట్ ల వద్ద అంత గొడవ జరిగాక మరోసారి మంత్రులు విడివిడిగా సుద్దులు చెప్పారు. ఇక కేబినెట్ భేటీ తర్వాత ఫైనల్ డెసిషన్ వెలువడుతుందనే అంచనాలున్నాయి. పీఆర్సీపై మేం చేయగలిగింది చేశాం, మీరు చేయాల్సింది చేసుకోండి అనే స్థాయిలో ప్రభుత్వం ప్రతిస్పందన ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆ స్థాయిలో ఘాటుగా బదులివ్వలేకపోతే.. భేటీ తర్వాత అసలు పీఆర్సీ ప్రస్తావన రాలేదని చెప్పబోతారని కూడా అనుకుంటున్నారు. ఈరెండిటిలో ఏది జరిగినా అది ఉద్యోగులకు ఇబ్బందే. మొత్తమ్మీద ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల్ని బుజ్జగించే ఆలోచనలో లేదని తేలిపోయింది. ఒకవేళ ఉద్యోగులు తెగేవరకు లాగితే మాత్రం ఈ ఉద్యమం మరో మలుపు తిరిగే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: