దేశంలో మూడో వేవ్ తీవ్ర‌త కొన‌సాగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య కొద్దిరోజులుగా ల‌క్ష‌ల సంఖ్య‌లో న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే. దేశ రాజ‌ధాని ఢిల్లీని క‌రోనా వ‌ణికిస్తోంది. అక్క‌డ త‌గ్గుతున్నాయ‌నుకున్నంతలోనే కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలో 11,486 కేసులు కొత్త‌గా న‌మోద‌య్యాయి. 45 మంది వైర‌స్ బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా మూడో వేవ్ మొద‌ల‌య్యాక ఢిల్లీలో ఒక్క‌రోజులో కోవిడ్ మ‌ర‌ణాల సంఖ్యలో ఇదే అధికం కావ‌డం క‌ల‌వ‌రం క‌లిగిస్తోంది.  ప్ర‌స్తుతం ఢిల్లీ న‌గ‌రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 58 వేల‌కు పైగానే ఉంది. ఇక కేర‌ళ రాష్ట్రంలో ఈ తీవ్ర‌త మ‌రింత ఎక్కువ‌గా ఉంది. శ‌నివారం ఒక్క‌రోజే  అక్క‌డ 45,000 కేసులు వచ్చాయి. 132 మంది చ‌నిపోయిన‌ట్టు అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి. ప‌రిస్థితులు గ‌మ‌నించాక వారాంతంలో లాక్‌డౌన్ విధించే అవ‌కాశాల్ని అక్క‌డి ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంది.

ఇక ఏపీలోనూ కోవిడ్ ఉధృతి పెరుగుతూనే ఉంది. కొత్త‌గా 13 వేల కేసులు న‌మ‌ద‌య్యాయి. ఆరుగురు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. దేశ‌వ్యాప్తంగా చూస్తే గ‌డ‌చిన 24 గంట‌ల్లో 3.37 ల‌క్ష‌ల కేసులు కొత్త‌గా పెరిగాయి. ఇదే స‌మ‌యంలో 2,42,000 మంది వైర‌స్ బారినుంచి కోలుకున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. అంటే కోలుకుంటున్న‌వారికంటే కొత్త కేసుల సంఖ్యే ఎక్కువ‌గా ఉంటోంది. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21 ల‌క్ష‌ల కంటే ఎక్కువ‌గానే ఉంది. వ‌చ్చే రెండు మూడు వారాల స‌మ‌యం కీల‌క‌మ‌ని మూడోవేవ్ ఈ ద‌శ‌లో గ‌రిష్టానికి చేరుకోవ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల్లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎన్నిక‌ల కమిష‌న్ బ‌హిరంగ స‌భ‌లు, నాయ‌కుల ఆధ్వ‌ర్యంలో సాగే రోడ్ షో ల‌పై ఆంక్ష‌ల‌ను ఈ నెల 31 వ‌ర‌కు పొడిగించింది. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ముమ్మ‌రంగా సాగుతోంద‌ని, ప్ర‌జ‌లు స్వీయ జాగ్ర‌త్త‌లు తీసుకోవడం ద్వారా మ‌హమ్మారి నుంచి ర‌క్షించుకోవాల‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: