
ప్రభుత్వం ఆలోచన ఎలా ఉంది..?
ఇప్పటి వరకైతే ప్రభుత్వం మెత్తబడేలా కనిపించడంలేదు. పైపెచ్చు కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు ప్రాసెస్ చేసేలా ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ బిల్లులు ప్రాసెస్ అయితే సగం పని పూర్తయినట్టే. అంటే ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు తీసుకోవడం మొదలు పెడితే.. మిగతా విషయాల్లో వారిని సులభంగా బుజ్జగించే అవకాశముంది. అందుకే ప్రభుత్వం ముందుగా బిల్లులు ప్రాసెస్ చేయాలని చూస్తోంది. ట్రెజరీ ఉద్యోగులు సహకరిస్తే ప్రభుత్వానికి ఈ పని సులభం అవుతుంది.
జగన్ తో హామీ..?
గతంలో పీఆర్సీ ఫిట్ మెంట్ విషయంలో తగ్గేది లేదన్న ఉద్యోగ సంఘాల నేతలు, సీఎం జగన్ తో భేటీ తర్వాత కాస్త మెత్తబడ్డారు. ఇప్పుడు మరో దఫా ఉద్యోగుల్ని అలా సీఎం దగ్గరకు తీసుకెళ్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ అవుతారని, ఆయనే స్వయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి సర్దుకుపోవాలని సూచిస్తారని అంటున్నారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడితే, పీఆర్సీ వరకు వేచి చూడకుండా, మధ్యలోనే మధ్యంతర భృతి రూపంలో ఆదుకునేందుకు బలమైన హామీ కూడా ఇస్తారని అంటున్నారు. ఆ హామీతో ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆలోచన విరమించే అవకాశముందని తెలుస్తోంది. స్వయంగా సీఎం జీతాల విషయంలో హామీ ఇస్తే ఉద్యోగులు వెనక్కి తగ్గుతారనేది మంత్రుల ఆలోచన. మరి దీనికి ఉద్యోగ సంఘాలు ఒప్పుకుంటాయా..? బేషరతుగా చర్చలకు వెళ్తాయా అనేది తేలాల్సి ఉంది. చర్చలు విఫలం అయినా, అసలు చర్చలే జరగకపోయినా.. ఉద్యోగులు ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలోకి వెళ్తారు.