ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెంచేందుకు చంద్రబాబునాయుడు సరికొత్త రాజకీయాన్ని అమలు చేస్తున్నారు. అంటే ఈ కొత్త రాజకీయమేమీ చంద్రబాబు కొనుక్కొన్నది కాదు చాలా పాతదే. కాకపోతే ఇపుడు చంద్రబాబు అమలుచేస్తున్న వ్యూహం సరికొత్తగా అంటే అప్ డేటెడ్ రాజకీయమన్నమాట. అదేమిటంటే నిజనిర్ధారణ కమిటి వేయటం తర్వాత రచ్చ రచ్చ చేయటం. తాజాగా గుడివాడలో క్యాసినో జరిగిందని చెప్పి వారంరోజులుగా ఎంత గోల చేస్తున్నారో అందరు చూస్తున్నదే.




ఒకపుడు నిజనిర్ధారణ కమిటి అంటే ఎంతో ముఖ్యమైతే తప్ప వేసేవారు కాదు. అదికూడా జనాలు నష్టపోయిన ఘటనల్లో మాత్రమే అంటే నిరసన సమయాల్లో పోలీసుల కాల్పుల్లో జనాలు చనిపోవటం, లేకపోతే గ్రమాల్లో రెండువర్గాల మధ్య గొడవ జరిగి ప్రాణ, ఆస్తి నష్టం జరగటం లాంటి ఘటనల్లో వాస్తవం ఏమిటో మిగిలిన జనాలకు తెలియటానికి మాత్రమే నిజనిర్ధారణ కమిటి ఏర్పాటయ్యేది. ఆ కమిటి కూడా అన్నీ రాజకీయపార్టీల నేతలతో ఏర్పాటయ్యేది.




అయితే ఇపుడు చంద్రబాబు ఆ పద్దతికి స్వస్తి చెప్పేశారు. కేవలం తన పార్టీ నేతలతో మాత్రమే నిజనిర్ధారణ కమిటి అని వేయటం తర్వాత రచ్చ రచ్చ చేయటం. గుడివాడలో క్యాసినో జరిగిందనే ఆరోపణల విషయంలో జరుగుతున్నదిదే. నిజంగానే క్యాసినో జరిగిందనే అనుకున్నా మామూలు జనాలకు ఏమాత్రం సంబంధంలేని విషయం. చంద్రబాబు హయాంలో పేకాట కోసమే ఎన్నో క్లబ్బులు అనధికారికంగా నడిచేవి. పోలీసులే వాటిపై దాడులు చేసి డబ్బును, పేకాటాడుతున్న వారిని అదుపులోకి తీసుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. అప్పట్లో వైసీపీ ఇపుడు టీడీపీ చేస్తున్నట్లు రచ్చ చేయలేదు.




మొన్న మాచర్లలో టీడీపీ కార్యకర్త హత్యకు గురైనపుడు కూడా ఇలాగే గోల చేశారు. టీడీపీ  నేతలతో నిజనిర్ధారణ కమిటి అన్నపుడు కచ్చితంగా ఆ కమిటి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడుతుందని అందరికీ తెలుసు. మళ్ళీ దీనికి నిజనిర్ధారణ కమిటి అని పేరొకటి. ఎలాగూ తమకు మద్దతిచ్చే ఎల్లోమీడియా ఉందికాబట్టి రోజుల తరబడి గోలచేయటమే చంద్రబాబు రాజకీయంగా కనబడుతోంది. ముందు ముందు ఇలాంటివి ఇంకెన్ని చూడాలో ఏమో. మరి దీనివల్ల టీడీపీకి వచ్చే ఉపయోగమేమిటో చంద్రబాబుకే తెలియాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: