భారత్ లో థర్డ్ వేవ్ కి కారణం ఒమిక్రాన్ కేసులా..? లేక.. డెల్టా తిరగబెట్టిందా అనేదానిపై ఇంతవరకు స్పష్టత లేదు. అయితే భారత్ లో ఒమిక్రాన్ కేసులకంటే సాధారణ కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇక్కడ మరో వాదన కూడా ఉంది. సాధారణ కేసులను కూడా ఒమిక్రాన్ వేరియంట్ కోసం పరీక్ష చేయిస్తే అందులో కూడా ఒమిక్రాన్ నిర్థారణ అవుతుందని, అయితే పరీక్షలు లేని కారణంగా ఒమిక్రాన్ జాడ తేలడంలేదని అంటున్నారు కొంతమంది. ఈలోగా ఇప్పుడు మరో కొత్త విషయం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అదే ఒమిక్రాన్ లోని సబ్ వేరియంట్. దాని పేరు బీఏ-2. స్టెల్త్ ఒమిక్రాన్ అని కూడా దీన్ని పిలుస్తున్నారు. అంటే రహస్య ఒమిక్రాన్ అనమాట. దీని జాడ కనిపెట్టడం బాగా కష్టం.

ఒమిక్రాన్ లో సబ్ స్ట్రెయిన్ ని ఇప్పటికే ప్రపంచ దేశాలు గుర్తించాయి. నార్వే, స్వీడన్, డెన్మార్క్ సహా ఇతర దేశాల్లో ఇటీవల ఇలాంటి కేసులు భారీగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. యూకే హెల్త్ సెక్యూరిటీ పరిశోధన ప్రకారం కొన్ని దేశాల్లో స్టెల్త్ ఒమిక్రాన్ కారణంగానే కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయట. డిసెంబర్ లోనే ఈ స్టెల్త్ ఒమిక్రాన్ ని గుర్తించారట. ప్రస్తుతం ఇది 40దేశల్లో వ్యాప్తిలో ఉందని సమాచారం.

ఆర్టీపీసీఆర్ పరీక్షలకు దొరికినా..
స్టెల్త్ ఒమిక్రాన్ వేరియంట్ ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మాత్రమే కనపడుతోంది. అయితే సాధారణ వేరియంట్ లతో పోల్చి చూస్తే ఒమిక్రాన్ లో ప్రత్యేకమైన ఉత్పరివర్తనాలుంటున్నాయి. కానీ బీఏ-2లో మాత్రం అలాంటివి కనిపించడంలేదు. అయితే ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో మాత్రం దీని ఉనికి కనపడుతోంది. అందుకే దీనికి రహస్య ఒమిక్రాన్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఒమిక్రాన్ కంటే ఈ బీఏ-2 వేరియంట్ ఎక్కువగా వ్యాపిస్తోందని చెబుతున్నారు వైద్య నిపుణులు. కొన్ని దేశాల్లో కేసుల సంఖ్య భారీగా పెరగడానికి ఈ వేరియంట్ కారణం అంటున్నారు. భారత్ లో దీని జాడ ఇప్పటి వరకూ కనపడకపోయినా అప్రమత్తత అవసరం అని అంటున్నారు నిపుణులు. ఒమిక్రాన్ ప్రభావానికి ఇంకా పూర్తి స్థాయిలో విరుగుడు కనిపెట్టలేకపోతున్నారు. బూస్టర్ డోస్ అన్నిటికీ మందు అని చెప్పేస్తున్నారు. ఈలోగా ఇప్పుడు బీఏ-2 స్టెల్త్ ఒమిక్రాన్ అంటే ఇది దెబ్బ మీద దెబ్బ అని చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: