బ్రిటిష్‌ వాళ్లు మన దేశాన్ని దాదాపు 400 ఏళ్లు పాలించారు. వాణిజ్యం కోసం అడుగు పెట్టి క్రమంగా దేశాన్ని దోచుకున్నారు. మన రాజుల్లోని అనైక్యతను వాడుకుని రాజ్యాధికారాన్ని కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు. బ్రిటిష్‌ వారు మనకు చేసిన అన్యాయం, అరాచకాన్ని చరిత్ర మరచిపోదు. అయితే.. బ్రిటీష్‌ పాలనలో కొంత మేలు కూడా జరిగింది. జరిగిన కీడుతో పోలిస్తే మేలు చిన్నదే అయనా అది అప్పుడప్పుడు ఆశ్చర్యపరుస్తుంది కూడా.


అలాంటి ఓ విశేషమే ఇటీవల కడప జిల్లాలో వెలుగు చూసింది. కడప జిల్లాలో బ్రిటిష్ కాలం నాటి ఓ సొరంగం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ పర్యాటకుడు దీన్ని గమనించారు. మొదట దీన్ని ఓ భూగర్భ, రహస్య కారాగారం అనుకున్నారు. కానీ.. ఆ తర్వాత పరిశీలించి చూస్తే కానీ.. ఆశ్చర్యపోయే వాస్తవాలు కనిపించలేదు. అది జైలు కాదని.. అది బ్రిటీష్‌ కాలం నాటి భూగర్భ జలాశయం అని తెలుస్తోంది. ఆ భూగర్భ కట్టడంలోని శిలాఫలకాల ద్వారా ఇది ఓ భూగర్భ  జలాశయంగా గుర్తిస్తున్నారు.


ఇంతకీ ఇది ఎక్కడ ఉందంటే.. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుగ్గ అగ్రహారం గ్రామ సమీపంలో ఉంది. ఈ భూగర్భ జలాశయాన్ని 1890లో నిర్మించారట. బ్రిటీష్‌ వారే దీన్ని నిర్మించినట్లు అక్కడి శిలాఫలకం చెబుతోంది. ఈ జలాశయాన్ని తాగునీటి అవసరాల కోసం వాడుకునేవారట. ఈ జలాశయంలో నీటిని నిల్వ చేసుకుని.. అవసరమైనప్పుడు కాల్వల ద్వారా కడపకు తీసుకెళ్లేవారని నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఈ భూగర్భ జలాశయం నిర్మాణంలో బ్రిటీష్‌ వారు కేవలం సున్నం గచ్చు మాత్రమే వినియోగించారు. అప్పట్లో సిమెంట్‌ ఉన్నా దాన్ని వాడలేదు. సున్నం గచ్చుతో నిర్మించినా 130 ఏళ్లు గడచిపోయినా ఈ నిర్మాణం మాత్రం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఈ భూగర్భ జలాశయంపై మరింత పరిశోధన జరిపి.. చారిత్రక ఆధారాలు సంపాదిస్తే.. ఆనాటి చరిత్రపై అవగాహన మరింత పెరుగుతుంది. దీన్ని ఓ పర్యాటక ప్రాంతంగానూ అభివృద్ధి చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: