కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి జనవరి 24 ను జాతీయ బాలికల దినోత్సవం గా ప్రకటించింది. దీని ముఖ్య ఉద్దేశం ఆడపిల్లల్లో సామాజిక అవగాహన పెంచి పీడన నుంచి విముక్తి కలిగించడం. అంతేగాక విద్య, ఆరోగ్య రంగాల్లో బాలికలు మరింత చురుకుగా ఉండేలా చూడటం.ఇప్పటికే ఎన్నో రంగాల్లో మహిళలు విజయాలు సాధిస్తున్నా.. ఇంకా ఎక్కడో తాము వెనకబడుతున్నాం అనే భావన లోనే ఉన్నారు. ఒకప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఆనదించించేవారు. కానీ ఆ తర్వాత మారిన సామాజిక పరిస్థితుల కారణంగా అమ్మాయి పుడితే అమ్మో ఆడపిల్లా! అనే స్థితికి దిగజారారు. ప్రస్తుత సమాజంలో కొంతమంది జెండర్ ద్వారా ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే కడతేర్చే ప్రయత్నాలు మొదలవుతున్నాయి. ఇంకా ఆడపిల్లలకు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. వీటన్నింటిని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ బాలిక అభివృద్ధి మిషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆడపిల్లల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించింది.
 దీనిలో భాగంగా సమాజంలో బాలికల సంరక్షణ పట్ల, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, పోషకాహారం, ఎదుగుదల వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవంగా నిర్వహిస్తోంది. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు,అసలు సృష్టే లేదు. అందువల్ల ఆడపిల్లను రక్షించుకుందాం.. అమ్మాయిలను ఆదరిద్దాం.. సృష్టిని కాపాడుకుందాం.. అమ్మగా, సోదరిగా, భార్యగా భవిష్యత్ తరాల కోసం..ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. మనదేశంలో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అద్భుతమైన పరిపాలన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీద కుటుంబం నుంచి వచ్చిన గిరిజన బాలిక మాలావత్ పూర్ణ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి తెలంగాణ ఘనతను  ప్రపంచానికి చాటింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆడ పిల్లలు ఎదుర్కొంటున్న వివిధ రకాల వివక్షలను నిర్మూలించడానికి, ఆడపిల్లలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సంవృద్ధి యోజన, బాలిక సంవృద్ధి యోజన, ద్వారా ఆర్థికంగా చేయూత నివ్వడం బేటి బచావో బేటి పడావో పథకం ద్వారా బాలికలను రక్షించడం-బాలికలను విద్యావంతులను చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రం బాలికా సంరక్షణ యోజన ద్వారా బీద కుటుంబంలో పుట్టిన బాలికలను ఉచితంగా ఇంటర్మీడియట్ వరకు చదివిస్తోంది. కర్ణాటకలో భాగ్యలక్ష్మి,మధ్యప్రదేశ్ లో లాడ్లీ లక్ష్మీ యోజన్, రాజస్థాన్ లో రాజ్యలక్ష్మి, గుజరాత్ లో బాలిక సంవృద్ధి యోజన, పంజాబ్ లో రక్షకి యోజన మొదలైన పథకాలు బాలికల రక్షణ కోసం రూపొందించారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఆయా రంగాల్లో వారికి తగినంత స్వేచ్ఛ ఇస్తూ, ఆడపిల్ల అనగానే భారంగా భావించే సంకుచిత ధోరణి నుంచి మారాలి.మాకు ఆడపిల్లే కావాలి అనే స్థాయికి సమాజం ఎదగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: