సమ్మెకు సిద్ధం అవుతున్న ఉద్యోగులు, లేదు లేదు మేం చెప్పిందే కరెక్టు అని చెప్పే  వైసీపీ సర్కారు..ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న సామాన్యులు. ఎందుకంటే ఉద్యోగులు సమ్మెకు వెళ్లకముందే కొన్నినిరసనల పేరిట కార్యాలయాల్లో విధులు విడిచి రోడ్డెక్కుతున్నారు.ఇలాంటి సమయంలో ఉద్యోగుల విధి నిర్వహణ సజావుగా సాగిపోతోందని ఎలా అనుకోగలం?


ఉద్యోగులకు సంబంధించి సమస్యలు పరిష్కరించడంలో జగన్ సర్కారు ప్రతిసారీ విఫలం అవుతూనే ఉందని సంబంధిత సంఘాలు మండిపడుతున్నాయి.గత ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వం నడుచుకుంటున్న తీరు అంతగా బాలేదని, అందుకే తాము సమ్మెకు సైతం సిద్ధం అవుతున్నామని అంటున్నారు. కేవలం విభజన సమస్యలను సాకుగా చూపి జీతాల పెంపుపై అడ్డగోలు వాదనలు వినిపించడం కూడా సబబుగా లేదని వీరంతా పెదవి విరుస్తున్నారు.విభజన అనంతరం 43శాతం తాము ఫిట్మెంట్ ను బాబు హయాంలో పొందామని, కానీ ఇప్పుడు 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించి ఐఆర్ కన్నా తక్కువ మొత్తం అందుకునేలా చేస్తున్నారని వాపోతున్నారు.  ప్రస్తుతం కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి వివాదం రేగుతోంది.ఉన్నంతలో తాము ఆర్థికంగా పది వేల కోట్ల రూపాయలకు పైగా భారం అయినప్పటికీ కొత్త పీఆర్సీకి సిద్ధం అయ్యామని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు.దీనిపై ఉద్యోగులు స్పందిస్తూ తమకు కొత్త పీఆర్సీ ఇవ్వవద్దని పాత పద్ధతిలోనే జీతాలు చెల్లించాలని,అదే విధంగా పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలను చెల్లిస్తే చాలనుకుంటున్నామని సోషల్ మీడియాలో వారు అదే పనిగా ప్రచారం చేస్తున్నారు.దీంతో ఇరు వర్గాల మధ్య దూరం పెరుగుతూ వస్తుంది.


అదేవిధంగా కారుణ్య నియామకాల్లోనూ ఈ ప్రభుత్వం వివక్షనే చూపిందని, కరోనా కారణంగా ప్రాణాలు పోయిన ఉద్యోగస్తుల స్థానంలో అదే కుటుంబానికి చెందిన వారికి జూన్ 30లోగా నియామకాలు చేపట్టాల్సి ఉన్నా ఎక్కడా పూర్తి స్థాయిలో జరగలేదు అని, కేవలం ఫ్రంట్ లైన్ వారియర్స్ విషయమై మాత్రం కాస్తో  కూస్తో శ్రద్ధ వహించారని ఉద్యోగులు విమర్శలు చేస్తున్నారు.


ఇక పదవీ విరమణ వయస్సును అరవై నుంచి అరవై రెండుకు పెంచడంపై కూడా విమర్శలు రేగుతున్నాయి.దీనిని తామేమయినా అడిగామా ఎందుకని ఇలాంటి నిర్ణయాలు వెలువరించడం అని,దీనిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. దీనివల్ల నిరుద్యోగ భారం పెరగడమే తప్ప మరొకటి లేదని కూడా వీరు తమ వాదనను వినిపిస్తున్నారు. ప్రభుత్వం తమకు ఏడాదికి 12 లక్షలు చొప్పున రెండు ఏళ్లకు 24 లక్షలు ఇవ్వాలనుకోవడం అన్నది తగదని, అలాంటి ప్రయోజనాలను తాము కోరుకోవడం లేదని కూడా తేల్చి చెబుతున్నారు.ఇవ్వాల్సిన జీతాలు పెంచాల్సిన జీతాలు  సకాలంలో ఇచ్చి సకాలంలో పెంచి తమను ఆదుకుంటే చాలు అని, సర్వీసును 58కి పరిమితం చేసినా అభ్యంతరమేమీ లేదని వీరు స్పష్టం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: