మోదీషాల ఆధ్వ‌ర్యంలో బీజేపీ గ‌తంలో ఎన్న‌డూ లేని స్థాయిలో బ‌ల‌ప‌డిన విష‌యం కాద‌న‌లేని వాస్త‌వం. కార‌ణాలు, క‌లిసొచ్చిన ప‌రిణామాలు ఏమైన‌ప్ప‌టికీ రాజీవ్‌గాంధీ త‌రువాత సింగిల్ పార్టీ ఆధ్వ‌ర్యంలో కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేంత మెజారిటీ తెచ్చుకున్న‌ది మోదీ మాత్ర‌మే. అయితే ఇదే స‌మ‌యంలో బీజేపీ ఎదుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డిన  మిత్ర ప‌క్షాల‌ను ప్ర‌ధానంగా ప్రాంతీయ పార్టీల‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చేందుకు ఆ పార్టీ కుట్ర‌లు చేసింద‌న్న అప‌వాదునూ మూట‌గ‌ట్టుకుంది. సుదీర్ఘ కాలం పాటు బీజేపీతో మిత్ర పార్టీగా ఉన్న శివ‌సేన ప్ర‌స్తుతం ఆ పార్టీపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. హిందుత్వ ప్రాతిప‌దిక‌గా బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తేవాల‌నే ల‌క్ష్యంతో తాము ఆ పార్టీ విజ‌యం కోసం ఎంతో కృషి చేశామని అయితే బీజేపీ త‌న మిత్ర ప‌క్షాల‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చే కుతంత్రాన్ని త‌మ‌పైనా ప్ర‌యోగించింద‌ని శివ‌సేన అధినేత‌, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ థాక‌రేతోపాటు ఆ పార్టీకి చెందిన నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా బీజేపీ హిందుత్వ నినాదం కేవ‌లం రాజ‌కీయ అవ‌కాశ‌వాద‌మ‌ని కూడా శివ‌సేన నాయ‌కులు తేల్చేయ‌డం, ద‌మ్ముంటే త‌మ‌తో ముఖాముఖి పోటీ చేయాల‌ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స‌వాల్ విస‌ర‌డం ద్వారా రెండు పార్టీల మ‌ధ్య విమ‌ర్శ‌లు మ‌రింత ప‌దును తేలాయ‌న్న‌ది నిజం.

ఒక‌ర‌కంగా ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ కంటే శివ‌సేన పార్టీయే బీజేపీకి పెద్ద త‌ల‌పోటుగా ప‌రిణ‌మించిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ రెండు పార్టీల మ‌ధ్య అస‌లు ఎందుకింత శ‌త్రుత్వం పెరిగింద‌నేది ఆస‌క్తిక‌రం. దేశ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన‌తో క‌లిసి పోటీ చేసిన కార‌ణంగానే మొద‌ట్లో బీజేపీ అక్క‌డ బ‌లం పెంచుకోగ‌లిగింది. గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత శివ‌సేన కంటే బీజేపీయే అక్క‌డ బ‌ల‌మైన పార్టీగా ఆవిర్భ‌వించింది. ఇది శివ‌సేన‌లో గుబులు పుట్టించిన ప‌రిణామం. బీజేపీని అక్క‌డే నిలువ‌రించ‌క‌పోతే త‌న ఉనికికే ప్ర‌మాద‌మ‌ని భావించ‌డం తోనే శివ‌సేన ఆ పార్టీతో విభేదించి సిద్ధాంత వైరుధ్యాల‌ను అధిగ‌మించి మ‌రీ కాంగ్రెస్‌, ఎన్‌సీపీల‌తో జ‌ట్టుక‌ట్టి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది బీజేపీకి ఏమంత‌ కొరుకుడు ప‌డ‌ని రాజ‌కీయ ప‌రిణామం. ఎందుకంటే యూపీ త‌రువాత మ‌హారాష్ట్ర అత్య‌ధిక ఎంపీ స్థానాల‌ను క‌లిగిఉన్న రాష్ట్రం. అంతేకాదు దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి ఉన్న‌దీ ఆ రాష్ట్రంలోనే. శివ‌సేన‌కు త‌మ పార్టీతో క‌ల‌వ‌కత‌ప్ప‌ద‌ని, మ‌రో ప్ర‌త్యామ్నాయం లేద‌ని బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం భావించింది. కానీ ఆ పార్టీ అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌లేదు స‌రిక‌దా ఇప్పుడు శివ‌సేన  గోవా స‌హా, ఉత్త‌రాది రాష్ట్రాల్లోనూ పోటీకి దిగుతానంటోంది. అంటే త‌మ‌దే అస‌లైన‌ హిందుత్వ పార్టీ అంటూ ప్ర‌చారం చేసుకోవ‌డం ద్వారా బీజేపీ ఓటుబ్యాంకుకు గండి కొట్టాల‌నుకుంటోంద‌న్న‌మాట‌. శివ‌సేన ప్ర‌భావం ఇత‌ర రాష్ట్రాల్లో ఏమేర‌కు ఉంటుంద‌న్న‌ది భ‌విష్య‌త్తులో బీజేపీ విజ‌యావ‌కాశాల‌ను నిర్ణ‌యించే అంశం కావ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: