ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం చేసింది ఇదీ. కానీ వారే అపార్థం చేసుకున్నారు. అప్పట్లో జీతాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడెలా ఉన్నాయి. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేలా సచివాలయ వాలంటీర్లు తమ గ్రూపు సభ్యులకు మెసేజ్ లు పంపిస్తున్నారు. 50 కుటుంబాలకు ఓ వాలంటీర్ ఉంటారు. ఆ వాలంటీర్ ఆ 50 కుటుంబాలతో ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఉంటారు. అలాంటి గ్రూపుల్లో తిరుగుతున్న వాట్సప్ సందేశాల సారాంశం ఇది. అంటే పరోక్షంగా ఉద్యోగులపైకి వాలంటీర్లను పంపించారనే ఆరోపణ కూడా ప్రభుత్వం ఎదుర్కొంటోంది. వాలంటీర్ల మెసేజ్ లపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఆ ప్రచారం ఆపండి..
గత కొన్ని రోజులుగా ఉద్యోగులు జీతాల పెంపుకోసం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో సోషల్ మీడియాలో కొందరు అసలు జీతాలెందుకు పెంచాలంటూ కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. దీని వెనక ఎవరున్నారు, ఎందుకిలా చేస్తున్నారనే విషయం పక్కన పెడితే.. సామాన్య ప్రజల వాదన అనే పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకి వ్యతిరేకంగా కొంత ప్రచారం అయితే మొదలైంది. అది సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. దీంతో ప్రభుత్వమే ఇదంతా చేయిస్తోందనేది ఉద్యోగుల అనుమానం.

ఆ అనుమానాలను బలపరిచేలా వాలంటీర్లతో కొన్ని మెసేజ్ లను పంపిస్తున్నారు. దీంతో సహజంగానే వాలంటీర్లు ఉద్యోగులకు శత్రువులుగా మారారు. కానీ ఇక్కడ వాలంటీర్లు తమకిచ్చిన ఆదేశాలు మాత్రమే పాటిస్తున్నారు. ఆ మెసేజ్ వల్ల ఉద్యోగులకు కలిగే నష్టాన్ని వారు అంచనా వేయలేకపోతున్నారు. ఉద్యోగులకు జీతాలు ఆల్రడీ పెంచామని, జీతాలు పెంచడం వల్ల ఖజానాపై అదనపు భారం పడిందని, అయినా ప్రభుత్వం భరిస్తోందని అంటున్నారు. కానీ ఉద్యోగులు మాత్రం ఆ వాదనను కొట్టిపారేస్తున్నారు. జీతాలు పెరగకపోగా తగ్గాయని, అందుకే తాము పాత జీతాలే ఇవ్వాలని కోరుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వంపై భారం లేకుండా పాతజీతాలివ్వండి మహాప్రభో.. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు మాకు పెరిగిన జీతాలు వద్దండీ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తమ్మీద ప్రభుత్వం మాత్రం తగ్గేలా లేదు. ఉద్యోగులు ప్రతిపక్షాల ట్రాప్ లో పడి అనవసరంగా ప్రభుత్వంపై నిందలేస్తున్నారనేది వారి వాదన.

మరింత సమాచారం తెలుసుకోండి: