రాష్ట్ర ప్రభుత్వ పెద్ద సజ్జల రామకృష్ణా రెడ్డి ఇప్పుడు ముందున్నంత స్పీడులో లేరు.ఎందుకనో ఆయన తగ్గిపోయారు.వైసీపీ అధికారంలోకి రాగానే అన్నీ తానై వ్యవహరించిన సజ్జల స్పీడు తగ్గిపోయింది.ఆ మాటకు వస్తే ఇంకొందరి స్పీడు కూడా బాగానే తగ్గిపోయింది. సమ్మె విషయంలో సజ్జల చెబుతున్న మాటలే ఇందుకు తార్కాణం.మంత్రుల కమిటీలో సజ్జలకు చోటివ్వడం కూడా ఉద్యోగులకు నచ్చలేదు అని తెలుస్తోంది.చాలా మంది మాకు సీఎం జగన్ మోహన్ రెడ్డా లేదా సజ్జల రామకృష్ణా రెడ్డా అన్న సందేహంతో మాట్లాడారు కూడా!


కొన్ని సందర్భాల్లో ఆయన నాయకత్వాన్ని కానీ ఆయన నిర్ణయాలను కానీ వైసీపీ కూడా వ్యతిరేకిస్తూనే ఉంది.దీంతో సజ్జల కూడా పూర్తిగా సైలెంట్ అయిపోవాలనే భావిస్తున్నారు.తనకు పదవులపై ఆశలేదని ఎప్పటి నుంచో ఆయన చెబుతూ వస్తున్నా రాజ్యసభకు ఆయనను పంపి, ఇక్కడి రాజకీయాల నుంచి విముక్తం చేయాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. కానీ సజ్జల మాత్రం ఇందుకు సుముఖంగా లేరనే తెలుస్తోంది. మొదట్నుంచి తాను పదవులకు దూరం అనే చెబుతున్నాను అని, ఇప్పటికిప్పుడు కొత్తగా తన విషయాల్లో నిర్ణయాలేమీ వద్దని ఆయన భావిస్తున్నారు.

వాస్తవానికి ఉద్యోగుల కుప్పి గెంతులు ఎలా ఉన్నా వీరితో మాట్లాడాలన్నా కాస్త కఠినంగా వ్యవహరించాలన్నా అటు బొత్స కానీ ఇటు సజ్జల కానీ సరైన వ్యక్తులు. బొత్స కూడా తనదైన పంథాలోనే ఆన్సర్లు ఇస్తున్నారు.ఆయనకు జగన్ పై కోపం ఉన్నా కూడా సరైన సందర్భంలో సరైన వ్యక్తిగానే ఆయన నడుచుకుంటున్నారు.వాస్తవానికి మంత్రులలో చాలా మంది సజ్జలను వ్యతిరేకించిన వారు ఉన్నారు.బొత్స కూడా ఇదే కోవ కానీ కలిసి పనిచేసేటప్పుడు ముఖ్యమంత్రి చెప్పే నిర్ణయాల అమలులో మాత్రం బొత్స ఎక్కడా వెనుకంజ వేయడం లేదు. తాము చర్చలకు సిద్ధం అని చెబుతున్నా సమ్మెకు వెళ్లడం అవివేకం అని అంటున్నారు మంత్రుల కమిటీ సభ్యులు.కనుక రేపటి వేళ సమ్మె చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కూడా అంటున్నారు సజ్జల.



ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం అన్నది జఠిలం కానుంది.ఇదే సమయంలో సజ్జల కూడా కాస్త తగ్గే ఉంటున్నారు. ఉద్యోగుల తనపై చెడు ప్రచారం చేస్తున్నారని అసహనం సైతం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం అంటే తానొక్కడినే అన్న విధంగా తాను ఏనాడూ నడుచుకోవడం లేదని కూడా అంటున్నారు. కానీ ఉద్యోగులు మాత్రం సజ్జలను టార్గెట్ చేశాకే,బొత్స జోలికి వెళ్తున్నారు. దీంతో సజ్జల కొంత మనోవేదనలోనే ఉన్నారు.అందుకనో ఎందుకనో ఆయన స్పీడు అయితే తగ్గిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: