రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో డిగ్రీలు, పీజీలు చదివిన వాళ్లు మార్కెట్లలో హమాలీలుగా చేరి కూలి పనులు చేస్తున్నారు. తాజాగా  వరంగల్ లోని  ఏనుమాముల మార్కెట్ లో హమాలీ పనిచేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న  పోస్ట్ గ్రాడ్యూవెట్ హమాలీల గురించి తెలుసుకుందాం..! పత్తి, భగభగమండే మిర్చి బస్తాలు మోయడానికి ఖరీద్ దారు దగ్గర కూలీలుగా చేరుతున్నారు. కాంటా వేసిన ఒక్కో బస్తాను లారీలో లోడ్ చేయడానికి 3 నుంచి 5 రూపాయల చొప్పున ఇస్తుండడంతో కష్టకాలంలో అదే పదివేలుగా భావిస్తున్నారు. మిర్చి బస్తా కు ఆ రోజు డిమాండ్ ఆధారంగా 5 నుంచి 6 రూపాయల వరకు ఇస్తున్నారు.

ఈ లెక్కన డైలీ వంద బస్తాలు లారీల్లో లోడ్ చేస్తే తప్పా 400 జేబుల్లోకి వచ్చే పరిస్థితి లేదు.కష్టకాలంలో ఇంటోళ్ల మంచి చెడు చూసుకునే బాధ్యత ఉన్నోళ్ళు.. కోచింగ్ కోసం డబ్బులు పనికొస్తాయని భావించే వాళ్ళయితే పగలు, రాత్రి తేడా లేకుండా ఎక్కువ గంటలు హమాలీ పనిచేస్తున్నారు. బయట అయిదు రూపాయలకు దొరికే అన్నపూర్ణ బండిలో అన్నం తిని.. పత్తి బస్తాలపై మూడు నాలుగు గంటలు కునుకు తీస్తున్నారు. వీళ్లంతా ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ లు ఎప్పుడు రిలీజ్ చేస్తుందా అని ఎదురుచూస్తున్న వాళ్లే. జనవరి నుంచి మిర్చి సీజన్ మొదలు కావడంతో నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదించుకోవాలని ఆరాటం లో తిండితిప్పలు మాని ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. మార్కెట్ నుంచి వేలకొద్ది బస్తాలు తరలించే క్రమంలో మిర్చి ఘాటుకు వీపులు మండుతన్నన్నప్పటికీ వ్యాపారులు అప్పజెప్పిన లోడు పూర్తవడానికి కొందరు ఏం తక్కువన్నా 18 గంటలు కూడా కష్టపడుతున్నారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్ లైసెన్స్ ఖరీద్ దారులు 400 మంది ఉండగా..

 కమీషన్ ఏజెంట్లు మరో 500 నుంచి 600 మంది దాకా ఉన్నారు. వీరి దగ్గర రెగ్యులర్ గా పని చేసేందుకు 2 వేల నుంచి 3 వేల మంది సామాన్యులు అందుబాటులో ఉంటారు. కాగా సీజన్ లో ఏనుమాముల మార్కెటు చుట్టుపక్కల జిల్లాల నుంచి రోజుకు 40 వేల నుంచి 50 పత్తి బస్తాలు, మిర్చి అయితే ఒక్కరోజే 50 వేల నుంచి లక్ష వరకు వస్తాయి. దీంతో కాంటా వేసిన బస్తాలను ఎప్పటికప్పుడు లారీల్లో లోడ్ చేసి మార్కెట్ నుంచి బయటకు తరలించాల్సి ఉంటుంది. దీంతో వ్యాపారులు వేగంగా పనిచేసే యూత్ వైపు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: