బీకాంలో ఫిజిక్స్ అనేది ఇప్పటి వరకూ బాగా పాపులర్. కానీ బీకామ్ లో పాలిటిక్స్ కూడా ఉంటుందని నిరూపించారు చంద్రబాబు, ఆయన అనుంగు శిష్యుడు అశోక్ బాబు. డి.కామ్ అనే విద్యార్హతను, బి.కామ్ గా మార్చేసి వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగిగా అక్రమ పదోన్నతి పొందారనేది అశోక్ బాబుపై గతంలో వచ్చిన ఆరోపణ. అయితే ఇప్పుడది కేసయింది. సీఐడీ కేసు నమోదు చేయడంతో మరోసారి అశోక్ బాబు వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆయనను అందలమెక్కించిన చంద్రబాబు కూడా బోనులో నిలబడాల్సిన పరిస్థితి. మొత్తమ్మీద బీకామ్ లో ఫిజిక్సే కాదు, బీకామ్ తో పాలిటిక్స్ కూడా చేయొచ్చని నిరూపించారు.

మెహర్ కుమార్ కీలకం..
చంద్రబాబు, అశోక్ బాబుని ప్రోత్సహించినా.. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినా.. అన్నీ టీడీపీ ప్రభుత్వంలో కామ్ గా జరిగిపోయాయి. కానీ ఇప్పుడు ఏకంగా సీఐడీ కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం మరోసారి ప్రముఖంగా తెరపైకి వచ్చింది. వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు మెహర్ కుమార్ లోకాయుక్తను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. లోకాయుక్త ఆదేశాల మేరకు అశోక్ బాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఎమ్మెల్సీ పదవి ఏమవుతుంది..?
అశోక్ బాబు ఎమ్మెల్సీ పదవికి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదంటున్నారు. ఉద్యోగ పదవీ విరమణ సమయంలో తనపై కేసులేవీ లేవని ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ తప్పు అని తేలుతోంది. అదే సమయంలో ఉద్యోగార్హత విషయంలో ఆయన సర్వీస్ రిజిస్టర్ ని కూడా ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతానికి సీఐడీ కేసుతో ఏదో జరిగిపోతుందని ఊహించలేం. కేసు విచారణ మొదలై అసలు విషయం బయటకొచ్చేసరికి ఎంత సమయం పడుతుందో చూడాలి.

ప్రస్తుతం టీడీపీ గుడివాడ అంశాన్ని బాగా హైలెట్ చేస్తోంది. దాన్నుంచి ఎలా తప్పించుకోవాలా అని వైసీపీ ఎదురు చూస్తోంది. అదే సమయంలో ఇప్పుడు వైసీపీకి మరో అస్త్రం దొరికినట్టయింది. అశోక్ బాబు వ్యవహారాన్ని వైసీపీ నేతలు హైలెట్ చేస్తున్నారు. చంద్రబాబు చేసిన అక్రమాల్లో ఇది కూడా ఒకటని విమర్శిస్తున్నారు. సమైక్య ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలను చంద్రబాబు అడ్డు పెట్టుకుని తన రాజకీయ పబ్బం గడుపుకున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: