రెండున్నరేళ్ల పాలనలో జగన్ పై చిన్న రిమార్క్ కూడా లేదని అంటారు. నేరుగా జగన్ పై ఎలాంటి విమర్శలు చేయలేని పరిస్థితి. కానీ అప్పుడప్పుడు మంత్రులు మాత్రం ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతున్నారు. ఇటీవల గుడివాడ వ్యవహారాన్ని టీడీపీ బాగా హైలెట్ చేస్తోంది. ఈ క్రమంలో మంత్రి కొడాలి నాని ప్రతిపక్షాలకు ఘాటుగా సమాధానాలిస్తున్నా.. అది సరిపోవడంలేదు. అయితే ఇప్పుడు కొత్తగా మరో మంత్రి సీదిరి అప్పలరాజు రెండోసారి ప్రతిపక్షాలకు దొరికిపోయారు. గతంలో రెవెన్యూ ఉద్యోగులపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆ సమయంలో రెవెన్యూ ఉద్యోగులంతా ఆందోళనకు దిగడంతో చివరకు అధికారులు దిగొచ్చారు. ఇప్పుడు మళ్లీ గ్రామ సర్పంచ్ లపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే మంత్రి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్పంచ్ లను బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని, రాజకీయాలకు సంబంధం లేకుండా జరిగే స్థానిక ఎన్నికల విషయంలో కూడా మంత్రి రాజకీయాలను తీసుకు రావడం సరికాదని అంటున్నారు నెటిజన్లు.

ఇంతకీ మంత్రి ఏమన్నారు..?
టీడీపీ సర్పంచ్ లు తింగరి వేషాలు వేస్తే.. వారిచ్చే ప్రతిపాదనలు ఎంపీడీవో ఆఫీసుల్లోనే ఆగిపోతాయని అన్నారు మంత్రి అప్పలరాజు. టీడీపీ సర్పంచ్ లు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పే సందర్భంలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. తింగరి వేషాలు వేస్తే ప్రతిపాదనలు ఆపేస్తామని చెప్పే సరికి ఆ వ్యాఖ్యలు దుమారం రేపాయి.

సర్పంచ్ లకు పార్టీలేంటి..?
స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతుతో గెలిచినా.. చివరకు అందరూ అధికార పక్షంవైపే వెళ్తారు. కానీ కొన్ని చోట్ల టీడీపీ మద్దతుతో గెలిచినవారు వైసీపీకి అనుకూలంగా లేరు. మంత్రి అప్పలరాజు నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. దీంతో కొన్నిచోట్ల అధికార పార్టీ నేతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓసారి ఇలాగే మీడియాలో హైలెట్ అయిన అప్పలరాజు, ఇప్పుడు మరోసారి కలకలం రేపారు. ఈ వ్యాఖ్యల దుమారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: