అన్ని వ‌ర్గాల‌కూ మేలు చేసేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏ పాటి ప్ర‌య‌త్నిస్తుందో కానీ ప్ర‌భుత్వ వ‌ర్గాల‌కు  మేలు చేసేందుకు మాత్రం గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఏటా జాతీయ పండుగ‌ల వేళ ఉంటుంది. అది త‌ప్పు కాదు కానీ ఆ విధానంలో ఉన్న లోపాల‌ను స‌వ‌రించుకోవాల్సిన బాధ్య‌త ఒక‌టి ఎవ‌రి వారు తీసుకోవాలి.అవును పండ‌గ రోజు ఎవ్వ‌రైనా విమ‌ర్శ‌ల జోలికి పోతారా లేదా ఫ‌లానా ప‌ని కావ‌డం లేదు అని చెబుతారా మా అవివేకం కాకపోతే! ఇక్క‌డ కాక‌పోయినా మ‌రో చోట అయినా గ‌వ‌ర్న‌ర్ కొన్నంటే కొన్ని నిజాలు చెబితే ఆనందించాలి మ‌నం. కానీ మొత్తం గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థే అబ‌ద్ధాల‌కు అడ్ర‌స్ గా మారిపోవ‌డం అన్నది విచార‌క‌రం. విషాద‌క‌రం కూడా!


రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు వాటి తీరు తెన్నుల‌పై గ‌వ‌ర్న‌ర్ చెప్పిన మాట‌లు అన్నీ నిజాల‌కు ద‌గ్గ‌ర అని భావిద్దాం.గ‌ణతంత్ర దినోత్స‌వాన ఆయ‌న మాత్రం ఎందుకు అబ‌ద్ధాలు చెబుతారు. ఆయ‌న చెప్పిన విధంగా న‌వ‌రత్నాలు క్ర‌మం త‌ప్ప‌క అమ‌లు అవుతున్నాయి అని కూడా విశ్వ‌సిద్దాం.అది కూడా త‌ప్పు కాదు. పండ‌గ రోజు ప్ర‌గ‌తి నివేదిక‌లో త‌ప్పులున్నా కూడా చెబుతున్న‌ది పెద్దాయ‌న క‌నుక మ‌నం క్ష‌మించి వ‌దిలేద్దాం. కానీ ఇవాళ నిజాలు చెప్ప‌నంత మాత్రాన నిజాలు అబ‌ద్ధాలు అయిపోవు అబ‌ద్ధాలు నిజాలుగా ప‌రిగ‌ణ‌న‌లోకి నోచుకోవు కూడా! క‌నుక దాచాల‌న్నా దాగ‌వులే దాగుడు మూత‌లు చెల్ల‌వులే !


ఇవాళ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ ప్ర‌త్యేక ప్ర‌సంగం ఇచ్చారు.ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న వివిధ ప‌థ‌కాలు వాటి తీరుతెన్నులు అన్నీ అన్నీ చెప్పారు.బాగానే ఉంది కానీ ప్రసంగంలో చాలా చోట్ల ఆయ‌న జ‌గ‌న‌న్న జ‌గ‌నన్న అని ప‌ల‌క‌డం ఎందుకు? ప‌థ‌కాల పేర్లు క‌నుక ప‌లికారే అనుకుందాం మ‌రి! చాలా చోట్ల వాస్త‌వాలు దాచి రాసుకు వ‌చ్చిన స్క్రిప్టు ప్ర‌కారం చ‌దివి ఏం సాధిస్తారని? అంటే గవ‌ర్న‌ర్ ప‌ద‌వి ఓ ర‌బ్బరు స్టాంపు లాంటిదే అనే క‌దా అర్థం. ఈయ‌నే కాదు గ‌తంలోనూ అంతే! ప్ర‌భుత్వాలు చెప్పిన విధంగా పాల‌క పార్టీలు ఏం చెబితే అది పాటించే విధంగా గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ ఉన్న కార‌ణంగానే చాలా చోట్ల వాళ్ల సొంతంగా నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతున్నార‌న్న మాట వాస్త‌వం.



మరింత సమాచారం తెలుసుకోండి: