చివరకు నరసాపురం రాజుగారి పరిస్ధితి ఇలాగైపోయింది. తనకు మద్దతుగా ఎవరినీ పోటీకి పెట్టద్దని రాజకీయపార్టీలను బతిమలాడుకునే స్ధాయికి దిగజారిపోయారు. మీడియాతో మాట్లాడిన వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు విచిత్రమైన కోరిక కోరారు. రాజీనామా చేసిన తర్వాత వచ్చే ఉపఎన్నికలో తాను పోటీచేస్తానని చెప్పిన ఎంపీ ప్రజా ప్రతినిధులు చనిపోతే వారి కుటుంబసభ్యులు పోటీచేసినపుడు కొన్ని పార్టీలు అభ్యర్ధులను నిలబెట్టడంలేదని గుర్తుచేశారు. ఒకపుడు తాను పోటీచేస్తే లక్షల మెజారిటితో గెలవటం ఖాయమని ఇదే రాజుగారు చెప్పారు. మరిపుడేమో పోటీ పెట్టద్దని బతిమలాడుకుంటున్నారు.





కాబట్టి అదే పద్దతిలో తాను పోటీ చేసినపుడు కూడా పార్టీలు అభ్యర్ధులను పోటీ పెట్టకూడదట. ఎందుకంటే తాను వ్యవస్ధకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న కారణంగా పార్టీలన్నీ తనకు మద్దతివ్వాలంటు ఎంపీ కోరటమే విచిత్రంగా ఉంది. ఒకవైపేమో ప్రజాప్రతినిధి చనిపోయినపుడు అని ఎంపీనే చెబుతున్నారు. మరోవైపేమో తనకు మద్దతుగా ఎవరినీ పోటీలోకి దింపకూడదని పార్టీలకు రిక్వెస్టు చేస్తున్నారు. ప్రజా ప్రతినిధి చనిపోయినపుడు పాటించే సంప్రదాయం తన విషయంలో వర్తించదని ఎంపీకి తెలియదా ?





పైగా ప్రజాప్రతినిధి చనిపోయిన తర్వాత జరిగే ఉపఎన్నికల్లో పోటీ పెట్టకపోవటమనే సంప్రదాయం కొన్నిసార్లు అమలవ్వటం లేదు.  కాబట్టి రఘురాజు కోరిక ఎట్టి పరిస్ధితిలోను తీరేదికాదు. ఈ అతిమాటలు మాట్లాడేకన్నా  ముందు రాజీనామా చేసి తర్వాత మాట్లాడితే బాగుంటుంది. తన రాజీనామాపై ఫిబ్రవరి 11 తర్వాత నిర్ణయం తీసుకుంటానన్నారు. మొన్నటివరకు ఫిబ్రవరి 5 తర్వాత నిర్ణయం అన్న ఎంపీ దాన్ని వారం రోజులు పెంచారు. రాజీనామా నిర్ణయంపై గడువెందుకు పెంచుతున్నారో రాజుగారే చెప్పాలి.





తనపై అనర్హత వేటు వేయించాలంటు పాత చాలెంజ్ నే మళ్ళీ వినిపించారు. నిజంగానే రాజీనామా చేసే ఉద్దేశ్యమే ఉంటే అధికారపార్టీతో చాలెంజులు, రాజీనామా నిర్ణయంపై గడువులు అవసరమే లేదు. ముందు రాజీనామా చేస్తే తర్వాత పార్టీల మద్దతు, ఆ తర్వాత గెలుపు విషయాన్ని అలోచించవచ్చు. తొందరలో మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో తనపై అనర్హత వేటు వేయించే విషయంలో పోరాడాలంటు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఆలూ లేదు చూలు లేదన్నట్లుగా రాజీనామా చేయకుండానే అనవసరపు మాటలు చాలానే మాట్లాడుతున్నారు ఎంపీ.


మరింత సమాచారం తెలుసుకోండి: