అసలే అంతంతమాత్రంగా ఉన్న పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సోనుసూద్ పెద్ద చిచ్చే పెట్టాడు. తన చెల్లెలు మాళవిక సూద్ పోటీచేస్తున్న మోగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒకచోట మాట్లాడుతు ముఖ్యమంత్రిగా  బాగా పనిచేస్తున్న చరణ్ జీత్ సింగ్ చన్నీకి పంజాబ్ ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వాలంటు పిలుపిచ్చారు. సీఎంగా చన్నీ అతితక్కువ సమయంలోనే పంజాబ్ లో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటు మెచ్చుకున్నారు.
సూద్ మాట్లాడిన ఈ రెండు మూడు మాటలు చాలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టడానికి. అసలే చన్నీ అంటే పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూకి మండిపోతుంటుంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ ను సీఎంగా సాగనంపిన తర్వాత తాను కుర్చీలో కూర్చుందామని సిద్ధూ అనుకున్నారు. ఈ ఉద్దేశ్యంతోనే కెప్టెన్ కు పొగపెట్టారు. అయితే ఊహించని విధంగా పార్టీ అధిష్టానం చన్నీని కుర్చీలో కూర్చోబెట్టింది. అప్పటివరకు చన్నీతో బాగా సన్నిహితుంగా ఉన్న సిద్ధూ ఒక్కసారిగా శతృవుగా మారిపోయాడు.
అప్పటినుండి కెప్టెన్ను సతాయించినట్లే చన్నీని కూడా సిద్ధూ బాగా సతాయిస్తున్నాడు. నిజానికి పార్టీలోని చాలామంది నేతలు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చన్నీనే ప్రకటించమని అధిష్టానానికి చెప్పారు. ఇదే విషయమై మీడియాతో మాట్లాడిన సిద్ధూ ఎన్నికలయ్యాక సీఎం అభ్యర్ధిని అధిష్టానమే నిర్ణయిస్తుందని ప్రకటించారు. దాంతో సిద్ధూకి భయపడే చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించటానికి వెనకాడుతోంది. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్ధిని ప్రకటించేందుకు వీల్లేదంటు సిద్ధూ అధిష్టానానికే అల్టిమేటమ్ ఇవ్వటమే విచిత్రం.
అందుకనే కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్ధి ఎవరనే విషయం బయటకు రాలేదు. అలాంటిది ఇపుడు సోను హఠాత్తుగా చన్నీయే ముఖ్యమంత్రి అభ్యర్ధి అన్నట్లుగా ప్రకటించేశారు. చన్నీకి ముఖ్యమంత్రిగా జనాలు మరోసారి అవకాశం ఇవ్వాలంటేనే సోను భావన ఏమిటో అందరికీ అర్ధమైపోతోంది. పార్టీలో జరుగుతున్న వివాదం తెలీకుండానే సోను ఈ విషయాన్ని ప్రస్తావించారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదో చెల్లెలు గెలుపుకోసం ప్రచారం చేసుకోకుండా చన్నీనే సీఎం చేయాలంటు సోను పిలుపివ్వటం ఏ వివాదానికి దారితీస్తుందో. ఏదేమైనా సోను పిలుపుకు సిద్ధు రియాక్షన్ ఏమిటో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: