కృష్ణా జిల్లాను రెండుగా విభజించి.. ఒకదానికి ఎన్టీఆర్ పేరుని పెట్టాలని ప్రతిపాదించింది వైసీపీ ప్రభుత్వం. ఎన్టీఆర్ కి ఇది అరుదైన గౌరవంగా చెబుతున్నారు వైసీపీ నేతలు. టీడీపీ అధికారంలో ఉండగా చేయలేని పనిని, వైసీపీ చేసి చూపెడుతోందని ఒకరకంగా టీడీపీ నేతల్ని, నందమూరి వారసుల్ని కార్నర్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పేరు బయటకొచ్చినప్పుడు నందమూరి వారి నుంచి రియాక్షన్ లేదెందుకని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ పేరుని కొత్త జిల్లాకు పెట్టడంతో ఆ జిల్లా వాసులంతా సంతోషపడుతున్నారని, నందమూరి వారసులు మాత్రం కనీసం స్పందించడానికి ఇబ్బంది పడుతున్నారని విమర్శిస్తున్నారు.

ఎన్టీఆర్ కి భారత రత్న, ఎన్టీఆర్ పేరుతో జిల్లా.. ఈ రెండూ తరచూ వినిపించే డిమాండ్లే. కానీ వీటిలో దేన్నీ టీడీపీ తన హయాంలో సాధించలేకపోయింది. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో టీడీపీ మిత్రపక్షం ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ కి భారత రత్న సాధ్యం కాలేదు. కానీ.. అప్పుడప్పుడు చంద్రబాబు సైతం ఎన్టీఆర్ కి భారత రత్న అనే డిమాండ్ చేస్తుంటారు. ఆ విషయం పక్కనపెడితే జిల్లాకు పేరు మార్చడం, లేదా కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం అనేది రాష్ట్రం చేతిలో పని. కనీసం ఎన్టీఆర్ జిల్లా కూడా టీడీపీ హయాంలో ఏర్పాటు కాలేదు. కానీ ఇప్పుడు సీఎం జగన్ జిల్లాల పునర్విభజనతోపాటు, ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనుకోవడం సంచలనంగా మారింది. దీనిపై ఎన్టీఆర్ కుమార్తె పురంద్రీశ్వరి మినహా ఇంకెవరూ స్పందించక పోవడం విశేెషం.

ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పడుతున్నా.. నందమూరి కుటుంబం నుంచి స్పందన లేదని, అసలు స్పందించడానికి కూడా వారికి నోరు పెగలడంలేదని వైసీపీ నేతలు కొంతమంది దెప్పి పొడుస్తున్నారు. కనీసం ఆ విషయంలో జగన్ కి థ్యాంక్స్ చెప్పేందుకైనా వారు సిద్ధంగా లేరని సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ఇక చంద్రబాబు పూర్తిగా ఈ విషయంలో కార్నర్ అయ్యారని, తాను చేయలేని పనిని, జగన్ చేయడంతో ఆయన ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, మామ అంటే ఆయనకు ఇష్టం లేదని, కేవలం పార్టీకోసమే ఎన్టీఆర్ పేరు, విగ్రహాలను వాడుకుంటున్నారని వైసీపీ నేతలు పదే పదే విమర్శిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ పేరు కూడా ఆయన అందుకే జిల్లాలకు పెట్టే సాహసం చేయలేదని కూడా అంటున్నారు. పోనీ ఆ పని జగన్ చేస్తే కనీసం ప్రశంసించడానికి కూడా నందమూరి వారసులు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. మొత్తమ్మీద ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెడుతున్నారనే వార్త కంటే, దాని చుట్టూ ఉన్న రాజకీయ వ్యవహారాలే బాగా హైలెట్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: