పీఆర్సీ అమలు విషయంలో ఆర్థిక శాఖ మరోసారి కీలక ఆదేశాలిచ్చింది. కొత్త పీఆర్సీ ప్రకారమే జీత భత్యాలు చెల్లించాలంటూ సర్క్యులర్ జారీ చేసింది. కొత్త పీఆర్సీకి అనుగుణంగా బిల్లుల్ని ప్రాసెస్ చేయాలంటూ ట్రెజరీ, పే అకౌంట్స్ విభాగాల అధిపతులకు ఇప్పటికే ఆదేశాలిచ్చింది. వాటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది.

ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి..
ఓవైపు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయాలంటూ ఒత్తిడి వస్తోంది, మరోవైపు కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో వారు మాత్రం కొత్త పీఆర్సీని అంగీకరించబోమని చెబుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయబోమని తెగేసి చెప్పారు. గతంలోనే దీనికి సంబంధించి ట్రెజరీ ఉద్యోగులు తీర్మానం చేశారు. తమ శాఖాధిపతులకు కూడా ఆ తీర్మానాలను అందించారు.

ఫిబ్రవరి-1న జీతాలు పడేనా..?
పీఆర్సీ గొడవలో ఫిబ్రవరి 1న అసలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడతాయా లేదా అనే అనుమానాలున్నాయి. పీఆర్సీ విషయంలో పీటముడి తొలగిపోకపోవడంతో జీతాలు ఆలస్యమయ్యే అవకాశముంది. అయితే కొత్త పీఆర్సీ ప్రకారమే బిల్లులు పెట్టాలంటూ ఆర్థిక శాఖ మరోసారి ఆదేశాలివ్వడంతో అసలు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు ట్రెజరీ ఉద్యోగులు.

నోటీస్ పీరియడ్ లో ఉన్నారు కాబట్టి వారు ప్రభుత్వం చెప్పినట్టు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్త పీఆర్సీని అంగీకరించి వాటి ప్రకారమే జీతాలు వేస్తే మాత్రం పాత పీఆర్సీ ప్రస్తావనే లేకుండా పోతుంది. అంటే ఇకపై ఉద్యమం చేసినా ఉపయోగం ఉండదని అంటున్నారు. ఈ దశలో ట్రెజరీ ఉద్యోగులే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులంతా అసలు ఫిబ్రవరి 1న జీతాలు పడతాయో లేదో అనే ఆందోళనలో ఉన్నారు. ఈలోపు సమస్యకు పరిష్కారం లభించకపోతే జీతాలు ఆలస్యమవుతాయని ఆర్థిక ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ నెల జీతాల విషయంలో ఆశలు వదిలేసుకునే ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణలోకి దిగారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: