2023 లో జరగబోయే ఎన్నికలకు టిఆర్ఎస్ టీం రెడీ అయిపోయింది. కొత్త జిల్లాలకు 33 మంది పార్టీ అధ్యక్షులను కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఎలక్షన్ నాటికి పార్టీని ప్రజల్లోకి  మరింత బలంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో అన్ని రకాలుగా, బలంగా నాయకులతోపాటు యంగ్ లీడర్లకు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుగా అవకాశం కల్పించారు. ఈ లిస్టు చూస్తేనే టీఆర్ఎస్ టార్గెట్ ఎంత స్పష్టంగా ఉందో అర్థమైపోతుంది. తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పడ్డాక తొలిసారి కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించింది అధికార టీఆర్ఎస్.

  ఆసిఫాబాద్ కోనేరు కోనప్ప, మంచిర్యాలకు బాల్క సుమన్,ఆదిలాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు జోగు రామన్న, నిజామాబాద్ కు జీవన్ రెడ్డి, కామారెడ్డిలో ముజీబుద్దీన్, కరీంనగర్ కు రామకృష్ణారావు,నిర్మల్ కు విఠల్ రెడ్డి, సిరిసిల్లలో తోట ఆగయ్య, జగిత్యాలలో కే.విద్యాసాగర్ రావు, పెద్దపల్లిలో కోరుకంటి చందర్,  సంగారెడ్డి లో చింతా ప్రభాకర్, సిద్దిపేటకు కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ పద్మాదేవేందర్ రెడ్డి, వరంగల్లో ఆరూరి రమేష్, కొత్తగూడెం రేగా కాంతారావు,  సూర్యాపేట బడుగుల లింగయ్య,నల్గొండకు రవీంద్ర కుమార్, యాదాద్రిలో కంచర్ల రామకృష్ణా రెడ్డి,  వికారాబాద్ లో డా.మెతుకు ఆనంద్, రంగారెడ్డి మంచిరెడ్డి కిషన్ రెడ్డి,
 మేడ్చల్ లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, నాగర్ కర్నూల్ కు గువ్వల బాలరాజు, మహబూబ్ నగర్ లో లక్ష్మారెడ్డి,
జోగులాంబ గద్వాల లో బి.కృష్ణమోహన్ రెడ్డి, వనపర్తి ఏర్పుల గట్టు యాదవ్, నారాయణపేట కు ఎస్. రాజేందర్ రెడ్డి,  హైదరాబాద్ కు మాగంటి గోపీనాథ్ ను అధ్యక్షుడిగా నియమించారు కెసిఆర్.


ఈ లిస్టును జాగ్రత్తగా పరిశీలిస్తే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కొత్త అధ్యక్షులను ఎంపికచేసారనిపిస్తోంది. అధ్యక్షుల లిస్టులో ముగ్గురు ఎంపీలకు, 20 మంది ఎమ్మెల్యేలకు, ఇద్దరు ఎమ్మెల్సీలకు, ముగ్గురు జిల్లా పరిషత్ చైర్మన్ లకు అవకాశం కల్పించారు. కొత్తగా జిల్లా అధ్యక్ష పదవులకు ఎంపికైన వారిలో ఇద్దరు ముగ్గురు మినహా మిగిలినవారంతా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న వారే ఉన్నారు. ప్రజల్లో నేతలకు ఉన్న ఆదరణతో పాటు వారి ఆర్థిక స్థితిగతులను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు టిఆర్ఎస్ భారీ ప్రణాళికలు రచిస్తోంది. త్వరలోనే సీఎం కేసీఆర్, కేటీఆర్ బస్సు యాత్రను చేపట్టనున్నట్లు సమాచారం. కొత్త జిల్లాల అధ్యక్షుల నాయకత్వంలోనే ఈ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లేందుకు టిఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇక జిల్లా అధ్యక్షుల ఎంపికపై పెద్దగా అసంతృప్తి జ్వాలలు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సెలెక్షన్ లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం సలహాలు, సూచనలు కూడా పాటించినట్లు తెలుస్తోంది. ఇటీవలే టీఆర్ఎస్ అన్ని జిల్లాల్లో పార్టీ పరిస్థితులపై పీకే టీంతో సర్వే చేయించింది. అందులో వచ్చిన ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగానే అధ్యక్షులు ఎంపిక జరిగినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: