ఉక్రెయిన్ విష‌యంలో న్యూక్లియ‌ర్ సూప‌ర్ ప‌వ‌ర్స్ ర‌ష్యా, అమెరికా మ‌ధ్య ఉధ్రిక్త‌త‌లు తారా స్థాయికి చేరాయి. ఉక్రెయిన్ మీద ర‌ష్యా దాడి చేస్తుందని నాటో ఇంటిలిజెన్స్ నివేదిక‌లు కూడా అంటున్నాయి. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు. యుద్ధాన్ని నివారించాలని కోరుకుంటున్నాన‌ని అన్నారు. అదే స‌మ‌యంలో, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రించారు.
 
ర‌ష్యా ఇప్ప‌టికే ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల్లో భారీ ఎత్తున‌ సైన్యం, యుద్ద సామాగ్రిని మోహ‌రించింది. అలాగే, ఉక్రెయిన్‌కు అండ‌గా అమెరికా నాటో  ద‌ళాలు త‌మ సైన్యాన్ని ఆ దేశంలోకి దింపాయి. దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ ప‌రిణామాల‌ను ప్ర‌పంచ దేశాలు ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నిస్తున్నాయి. ఈ అనిశ్చితి మ‌ధ్య రష్యా తదుపరి చర్యల కోసం ఉక్రెయిన్ ఎదురుచూస్తోంది. ఐతే, త‌మ‌కు దాడి చేసే ఉద్దేశం లేద‌ని  రష్యా మొద‌టి నుంచీ చెపుతూ వ‌స్తోంది.

ఉక్రెయిన్ ఒక‌ప్పుడు సోవియ‌ట్ యూనియ‌న్ లో భాగం. ర‌ష్యా పొరుగునే ఉన్న ఈ దేశాన్ని నాటో స్థావ‌రంగా మార్చే కుట్ర జ‌రుగుతోందని,  కూటమిలోకి లాగేందుకు అమెరికా దాని మిత్ర దేశాలు తెర వెన‌క నుంచి క‌థ న‌డిపిస్తున్నాయ‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. అందుకే, పుతిన్ ఉక్రెయిన్‌ను భ‌య‌పెట్టే ప‌నికి పూనుకున్నారు. ఆ దేశం  నాటో  స‌భ్య‌త్వం  పొందేందుకు ఎప్పటికీ అనుమతించవద్దన్నది రష్యా ప్రధానమైన డిమాండ్.  

తాజా ఉద్రిక్త‌త‌ల న‌డుమ ఉక్రెయిన్ కు సాయంగా బ‌య‌టి  దేశాలు ఆయుధాలను  పంపడానికి అమెరికా గ‌త  గురువారం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ర‌ష్యా  చొరబాటుకు య‌త్నిస్తే  అమెరికా, దాని మిత్ర దేశాలు గ‌ట్టిగా పప్రతిస్పందిస్తాయ‌ని అమెరికా  వార్నింగ్  ఇచ్చింది.  మరోవైపు, ఈ సంక్షోభం మ‌రింత‌ ముదిరితే  ప్రపంచానికి ప్రమాదకరమని బ్రిటన్ అంటోంది. మొత్తానికి పాశ్చాత్య దేశాల‌న్నీ అంటున్న ఒకే ఒక మాట‌  ఉక్రెయిన్‌లో రష్యా జోక్యం త‌గ‌ద‌ని.  నీ ఇంటి ప‌క్క‌నే నీకు గోతి త‌వ్వుతాం.. నువ్వు చూస్తూ ఉండు అంటే పుతిన్ త‌ల ఊపి ఊరుకుంటాడా? ఊరుకోవ‌ట్లేదు క‌నుకే ప‌రిస్థితి ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చింది.

ఉక్రెయిన్ విష‌యంలో అమెరికా, దాని మిత్ర దేశాలకు హెచ్చ‌రిక‌గా గ‌త ఏడాది ఆగస్టులో క్రిమియాలో రష్యా పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. అలాగే, తూర్పు యుక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతం దగ్గర పెద్ద ఎత్తున ఆయుధాలు మోహరించింది. ఐతే కొద్ది రోజుల త‌రువాత అక్క‌డి నుంచి వాటిని ఉపసంహరించుకుంది. మళ్లీ గ‌త  న‌వంబ‌ర్ నుంచి ఈ ప్రాంతంలో రష్యా తన సైనికులను మోహరించడం ప్రారంభించింది. బెలారూస్ వరకు విస్తరింపజేసింది. బెలారూస్‌లో రెండు దేశాల సైనికులు విన్యాసాలు నిర్వహించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: