ప‌ద్మ పుర‌స్కారాల ప్ర‌క‌ట‌న‌తో చాలా వివాదాలే రేగుతున్నాయి. ఓ వైపు మొగుల‌య్య లాంటి సామాన్యుల‌కు ప‌ద్మ పుర‌స్కారం  ప్ర‌క‌టించిన వైనంపై ప్ర‌శంస‌లు రేగుతుంటే మ‌రోవైపు రాజకీయ నాయ‌కుల‌కు ఇదే పుర‌స్కారం ప్ర‌క‌టించ‌డంపై ప‌లువురు పెద‌వి విరుస్తున్నారు. అస‌లు అత్యున్న‌త పుర‌స్కారాల‌కు ఉండాల్సిన అర్హ‌త‌లేంటి? ఎందుక‌ని వీళ్ల‌కు ఇస్తున్నారు?
దేశానికి సేవ చేసిన వారెంద‌రో ఇంకా గుర్తింపు లేకుండా ఉన్నారే! వారిని వెలుగులోకి తీసుకు రావాల్సిన బాధ్య‌త కూడా కేంద్రానిదే క‌దా! అన్న వాద‌న ఒక‌టి ప్ర‌గాఢ రీతిలో విన‌ప‌డుతోంది. కానీ బీజేపీ స‌ర్కారు ఇలాంటివేవీ వినిపించుకోదు గాక వినిపించుకోదు.


కాంగ్రెస్ నుంచి గులాబ్ న‌బీ అజాద్ కు, బీజేపీ నుంచి క‌ల్యాణ్ సింగ్ కు ప‌ద్మ పుర‌స్కారాలు ప్ర‌క‌టించి కేంద్రం కొత్త వివాదంలో ఇరుక్కుంది. అజాద్ కు ప‌ద్మ భూష‌ణ్, క‌ల్యాణ్ సింగ్ కు ప‌ద్మ విభూష‌ణ్ ను ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్యప‌రిచింది.ఇదే స‌మ‌యంలో రాజ‌కీయ నాయ‌కుల‌కు ప‌ద్మ పుర‌స్కారాలెందుకు అన్న వాద‌న ఒక‌టి బ‌లీయంగా వినిపిస్తుంది.వాళ్లేమ‌యినా స్వాతంత్ర్య స‌మ‌ర యోధులా లేదా దేశం కోసం ప్రాణాల‌ర్పించిన వీరులా ఎందుక‌ని వాళ్ల‌కు అవార్డులు ఇవ్వ‌డం అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. మ‌ర‌ణానంత‌రం క‌ల్యాణ్ సింగ్ కు ప‌ద్మ పుర‌స్కారం ప్ర‌క‌టించి  ఇంకా ఆశ్చ‌ర్య ప‌రిచింది బీజేపీ. ఇక కాంగ్రెస్ కు చెందిన లీడ‌ర్ గులాబ్ న‌బీ అజాద్ కు కూడా ఇదే కోవ‌లో ప‌ద్మ పుర‌స్కారం ఇచ్చి ఎందుక‌నో కొత్త గొయ్యి ఒక‌టి తవ్వింది. ఈ గొయ్యిలో ఎవ‌రు ప‌డ‌నున్నారో అన్న‌దే ఆస‌క్తిదాయ‌కం.


ఇక రాజ‌కీయ వేత్త‌ల‌కు ప‌ద్మ పుర‌స్కారాల ప్ర‌దానంలో ముఖ్యంగా స్వార్థ ప్రయోజ‌నాలే కీల‌కంగా ఉన్నాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే క‌ల్యాణ్ సింగ్ కు అవార్డు ప్ర‌క‌టించారు అన్న‌ది సుస్ప‌ష్టం. ఆ వేళ రామ జ‌న్మ‌భూమి వివాదంలోనూ, బాబ్రీ మ‌సీదు కూల్చివేత‌లోనూ ప్ర‌త్య‌క్ష సాక్షిగా ఉన్న ఆయ‌న త‌రువాత కాలంలో చాలా వివాదాలే ఎదుర్కొన్నారు. ఓ ద‌శ‌లో పశ్చాత్తాపం కూడా వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌కు మ‌ర‌ణానంత‌రం అవార్డు ఇవ్వ‌డం అంటే యూపీ శ్రేణుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే! అదేవిధంగా మిగ‌తా నాయ‌కులు ఎవ్వ‌రికి ప‌ద్మ పుర‌స్కారం అందించినా అవ‌న్నీ ప్ర‌జా ప్ర‌యోజ‌నార్థం జారీ చేసిన‌వి కావ‌ని కేవ‌లం స్వార్థ ప్రయోజనాల‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చి అందించిన‌వే అని తేలిపోయింది ఇవాళ.



మరింత సమాచారం తెలుసుకోండి:

bjp