తూర్పు గోదావ‌రి..ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల పేర్ల మార్పు విష‌య‌మై అక్క‌డి ప్ర‌జ‌ల‌తో పాటు మంత్రులు కూడా తీవ్ర అభ్యంత‌రాలు చెప్పిన నేప‌థ్యంలో ఆఖ‌రి నిమిషంలో రాష్ట్ర క్యాబినెట్ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంది. గెజిట్ లో కూడా కొన్ని మార్పులు చేసింది.దీంతో మార్పుల‌తో కూడిన గెజిట్ ను నిన్న‌టి వేళ అర్ధ‌రాత్రి దాటిన త‌రువాత ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.


వాస్త‌వానికి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వివాదాలు రేగుతూనే ఉన్నాయి.చాలాచోట్ల అసంతృప్త‌త‌లు ఉన్నాయి. ముఖ్యంగా కొన్నిచోట్ల రెవెన్యూ డివిజ‌న్లు పోయాయ‌ని కొంద‌రు అభ్యంత‌రాలు లేవ‌నెత్తుతుంటే,కొంద‌రు పేర్ల విష‌య‌మై గ‌గ్గోలు పెడుతున్నారు.మ‌రికొంద‌రు త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని, అభివృద్ధికి త‌మ ప్రాంతాలు దూరంగా ఉండిపోవ‌డం ఖాయ‌మ‌ని వ్య‌థ చెందుతున్నారు.



దీంతో ఈ వివాదాలు ఇప్ప‌టికిప్పుడు తేలేలా లేవు.ముఖ్యంగా పేర్ల విష‌య‌మై వ‌స్తున్న గొడ‌వను స‌ర్దుబాటు చేసే క్ర‌మంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నేరుగా రంగంలోకి దిగి దిద్దుబాటు చ‌ర్యలు చేప‌ట్టారు.వీటి ప్ర‌కారం రాజ‌మండ్రి కేంద్రంగా ఏర్పాట‌య్యే జిల్లాకు తూర్పు గోదావ‌రి అని, భీమ‌వ‌రం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు ప‌శ్చిమ గోదావ‌రి అని నామ‌క‌ర‌ణం చేశారు.మొద‌ట ఈ విధంగా లేకున్నా ఆఖరి నిమిషంలో పేర్ల మార్పు అనివార్యం అయింది.

మంత్రుల సూచ‌న‌తో ముఖ్య‌మంత్రి దిద్దుబాటుకు పూనుకున్నార‌ని ప్ర‌ధాన మీడియా వెల్ల‌డిస్తోంది. మొద‌ట అనుకున్న విధంగా అయితే రాజ‌మ‌హేంద్రవ‌రం జిల్లా ఏర్పాటు కావాలి.రాజ‌మండ్రి కేంద్రంగా ఏర్పాట‌య్యే జిల్లాకు ఈ పేరే స‌బ‌బు అని అనుకున్నారు కానీ త‌రువాత మార్చారు.అదేవిధంగా ఇక్క‌డ కాకినాడ కేంద్రంగా ఏర్పాట‌య్యే జిల్లాకు కాకినాడ జిల్లాగా మార్చారు.మొద‌ట కాకినాడ కేంద్రంగా ఏర్పాట‌య్యే జిల్లాకు తూర్పు గోదావ‌రి జిల్లా అని పేరు పెట్టి త‌రువాత త‌మ నిర్ణ‌యం మార్చుకున్నారు. అదేవిధంగా భీమ‌వ‌రం కేంద్రంగా ఏర్పాట‌య్యే జిల్లాకు మొద‌ట న‌ర‌సాపురం జిల్లా అని అనుకున్నారు కానీ త‌రువాత మార్చారు. దీంతో వివాదం కాస్త స‌ర్దుమ‌ణిగింది.ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యంతో ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు ఆనందాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp